
కన్నడ హీరో దర్శన్ ప్రస్తుతం అభిమానిని హత్య చేసిన కేసులో జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇటు అభిమానులను మాత్రమే కాకుండా, అటు న్యాయవర్గాలను కూడా ఆశ్చర్యానికి గురిచేశాయి. “విచారణను త్వరగా పూర్తిచేయండి, నాకు మరణశిక్ష విధించినా పర్వాలేదు” అని దర్శన్ చేసిన ఆవేదనాత్మక వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వివరాల్లోకి వెళ్తే — అభిమానిని హత్య కేసులో జైలులో ఉన్న దర్శన్, అక్కడ తాను కనీస సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నానని పలుమార్లు కోర్టుకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఆయన తరఫు న్యాయవాది 20 సార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినా, ఒక్కసారి కూడా పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో విసిగిపోయిన దర్శన్, తన తరఫు లాయర్ సునీల్ ద్వారా కోర్టుకు “ఇక విచారణ త్వరగా పూర్తిచేసి, శిక్ష విధించినా సరే. జైలులో ఇలాగే ఉంచడం కంటే ఆ శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను” అని చెప్పించినట్లు సమాచారం.
జైలులో వెన్నునొప్పి సమస్యతో తీవ్రంగా బాధపడుతున్న దర్శన్, “తగిన వైద్య సదుపాయాలు ఇవ్వడం లేదు. సైనైడ్ ఇస్తే తిని చనిపోతాను” అని గతంలో చెప్పిన విషయాన్ని కూడా న్యాయవాది ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసి, తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.
ఇక ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఎన్నో సంవత్సరాలు సుఖసౌకర్యాలతో జీవించిన దర్శన్ ఇప్పుడు జైలులో కనీస సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతుండడంతో, “ఇలాంటి జీవితానికి బదులు మరణమే మేలు” అనే స్థితికి చేరుకున్నాడని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
గత ఏడాది నటుడు దర్శన్ తన సహనటి పవిత్ర గౌడతో రిలేషన్‌లో ఉన్నట్టు వార్తలు వెలుగులోకి వచ్చాయి. పవిత్ర సోషల్ మీడియాలో “మన బంధం పదేళ్లుగా కొనసాగుతోంది” అని పోస్టు చేయడంతో, దర్శన్ అభిమాని రేణుక స్వామి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆమెపై అసభ్య వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో దూషించాడు. దీంతో కోపంతో దర్శన్, పవిత్రతో పాటు మరికొందరు కలిసి రేణుక స్వామిని హత్య చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఇదే కేసు విచారణలో ఉంది.
Recent Random Post:














