దిల్ రాజు బ్రాండ్ ఇమేజ్ సంకటంలో!

Share


తెలుగు చిత్రసీమలో ఏడాది పొడవునా స్థిరంగా సినిమాలు నిర్మిస్తూ దూసుకెళ్తున్న నిర్మాతల్లో దిల్ రాజు పేరు ముందు వరుసలో ఉంటుంది. కేవలం ఒకో సినిమా లాభనష్టాలకే పరిమితం కాకుండా, మొత్తం సంవత్సరానికి సంబంధించిన బ్యాలెన్స్ షీట్‌ను బేస్ చేసుకొని వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తారు. నిర్మాతగా కాకుండా ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌గానూ ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే, ఇటీవలి కాలంలో మాత్రం ఆయన బ్రాండ్ ఇమేజ్‌కు తగిన స్థాయి కంటెంట్‌తో సినిమాలు రాకపోవడం పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.

ఒకప్పుడు “దిల్ రాజు బ్యానర్ అంటే క్వాలిటీ కంటెంట్ గ్యారంటీ” అని ప్రేక్షకులు నమ్మే స్థితి ఉండేది. కుటుంబ ప్రేక్షకులు పెద్దగా కథ గురించి తెలుసుకోకుండానే థియేటర్లకు వెళ్లేలా ఒక విశ్వాసం ఏర్పడింది. హీరోల ఫ్యాన్స్ కూడా తమ హీరో, దిల్ రాజు బ్యానర్‌లో సినిమా చేయాలని కోరుకునే స్థాయికి వెళ్ళారు. అయితే, గత మూడు సంవత్సరాల్లో ఈ నమ్మకం కొద్దికొద్దిగా తగ్గిపోయింది.

ఇటీవల దిల్ రాజు నిర్మించిన ‘తమ్ముడు’ పెద్ద అంచనాల మధ్య విడుదలై తీవ్రంగా నిరాశపరిచింది. కంటెంట్ ప్రేక్షకుల‌ను ఆకట్టుకోలేకపోవడంతో, బయ్యర్లకు భారీ నష్టాలు వచ్చాయి. అలాగే ఆయన పంపిణీ చేసిన కొన్ని సినిమాలు కూడా ఫెయిల్యూర్ కావడంతో, మార్కెట్‌లో ఆయనపై నమ్మకాన్ని తగ్గించినట్టైంది. గతంలో పక్కా ప్లానింగ్‌తో బడ్జెట్‌ను కంట్రోల్ చేస్తూ లాభాలు పొందిన రాజు గారు, ఇప్పుడు భారీ ఖర్చులు పెట్టి కూడా అంచనాలకు తగిన విజయాన్ని అందుకోవడం లేదు.

SVC బ్యానర్ అంటే ఒక బ్రాండ్. కానీ ప్రస్తుతం ఆ బ్రాండ్‌ను మళ్ళీ నిలబెట్టుకోవడానికి కంటెంట్‌లో కచ్చితంగా మార్పులు అవసరం. ‘ఆర్య’, ‘బొమ్మరిల్లు’, ‘శతమానం భవతి’ వంటి హార్ట్‌టచింగ్ సినిమాలు ఆయన బ్యానర్‌లో కొన్ని సంవత్సరాలుగా కనిపించడంలేదు. వందల కోట్ల బడ్జెట్ పెట్టి స్టార్ కాంబినేషన్లపై ఎక్కువ ఫోకస్ పెట్టడమే ఇప్పుడు మైనస్ అవుతోంది.

ప్రస్తుతం ఆయన నిర్మాణంలో ఉన్న ‘రౌడీ జనార్దన్’, ‘ఎల్లమ్మ’ సినిమాలు ఈ బ్యానర్‌కు మరలా బ్రాండ్ విలువను తీసుకురావటంలో కీలకంగా మారే అవకాశం ఉంది. ఈ రెండు చిత్రాలు పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే, దిల్ రాజు మళ్ళీ ఫామ్‌లోకి వచ్చే అవకాశముంది. లేదంటే, ఈ బ్రాండ్ ఇమేజ్ మరింత దెబ్బతినే ప్రమాదం ఉంది.


Recent Random Post: