
అడివి శేష్ సినిమా అంటే ప్రేక్షకుల్లో ఒక మినిమమ్ గ్యారంటీ అనే నమ్మకం ఉంటుంది. ఆయన చేసే ప్రయోగాలు, ఎంచుకునే కథలు ఇప్పటివరకు ప్రేక్షకులను నిరాశపరచలేదు. ఇప్పుడు అదే నమ్మకంతో ‘డెకాయిట్’ అనే ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రాన్ని మార్చి 19న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు.
అయితే ఈ రిలీజ్ డేట్ విషయంలో టీజర్ లాంచ్ ఈవెంట్లో ఒక ఆసక్తికరమైన చర్చ చోటుచేసుకుంది. అదే సమయంలో బాలీవుడ్ నుంచి భారీ పోటీ ఉందని విలేకరులు ప్రశ్నించగా, శేష్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మార్చి 19న హిందీలో భారీ అంచనాల మధ్య రణవీర్ సింగ్ హీరోగా నటిస్తున్న ‘ధురంధర్ 2’ విడుదల కానుంది. ఫస్ట్ పార్ట్ బ్లాక్‌బస్టర్ కావడంతో సెకండ్ పార్ట్‌పై భారీ అంచనాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ‘డెకాయిట్’ లాంటి సినిమాను రిలీజ్ చేయడం రిస్క్ కాదా? హిందీ మార్కెట్ పరంగా ఇది ‘బ్యాడ్ డేట్’ కాదా? అంటూ ఒక రిపోర్టర్ శేష్‌ను నేరుగా ప్రశ్నించారు.
దానికి అడివి శేష్ చాలా కాన్ఫిడెంట్‌గా స్పందించారు. గతంలో తన ‘మేజర్’ సినిమా రిలీజ్ సమయంలో కూడా ఇదే తరహా పోటీ ఎదురైందని గుర్తు చేశారు. ఒకవైపు యశ్ రాజ్ ఫిల్మ్స్ ‘పృథ్వీరాజ్’, మరోవైపు కమల్ హాసన్ ‘విక్రమ్’ లాంటి భారీ చిత్రాలు ఉన్నప్పటికీ ‘మేజర్’ తన సత్తా చాటిందని అన్నారు. “కంటెంట్ ఉంటే పోటీ గురించి భయపడాల్సిన అవసరం లేదు” అన్నది ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించింది.
“సముద్రంలో చాలా పెద్ద పెద్ద చేపలు ఉండొచ్చు… కానీ మేము గోల్డ్ ఫిష్” అని సింపుల్‌గా కానీ స్ట్రాంగ్‌గా చెప్పేశారు. సైజ్ చిన్నదైనా, విలువ మాత్రం ప్రత్యేకమని, గోల్డ్ ఫిష్‌కు ఉండే ప్రత్యేకత ఎప్పుడూ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుందని ఆయన నమ్మకం.
నిజానికి అడివి శేష్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిలబడటానికి ప్రధాన కారణం వాటిలోని కంటెంటే. గూఢచారి, మేజర్, హిట్ 2 లాంటి సినిమాలు తీవ్ర పోటీ ఉన్నా కూడా మంచి కలెక్షన్స్ రాబట్టాయి. ఇప్పుడు అదే నమ్మకంతో ‘డెకాయిట్’ రంగంలోకి దిగుతోంది.
మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించడం సినిమాకు గ్లామర్ అడ్వాంటేజ్‌గా మారింది. హిందీ మార్కెట్లో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉండటంతో అది మరో ప్లస్ అవుతుందని ట్రేడ్ భావిస్తోంది.
‘ధురంధర్ 2’ లాంటి సునామీ వచ్చినా, ఈ గోల్డ్ ఫిష్ మాత్రం ఈజీగా ఈదేస్తుందని శేష్ పూర్తి నమ్మకంతో ఉన్నారు. మరి మార్చి 19న బాక్సాఫీస్ దగ్గర ఏం జరుగుతుందో, శేష్ నమ్మకం ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.
Recent Random Post:














