నాగ చైతన్య కోసం భారీ సెటప్ రెడీ

Share


సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రస్తుతం టాలీవుడ్‌లో స్మాల్ నుంచి మీడియం, భారీ బడ్జెట్ చిత్రాల వరకు విస్తృతంగా సినిమాలు నిర్మిస్తూ దూసుకెళ్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ. సూర్యదేవర నాగ వంశీ ఈ బ్యానర్‌లో వరుసగా ప్రాజెక్టులు లైనప్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

ఈ బ్యానర్ నుంచి వచ్చిన తొలి చిత్రం శైలజా రెడ్డి అల్లుడు. నాగ చైతన్య హీరోగా రూపొందిన ఈ సినిమాతోనే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఏడేళ్ల కాలంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించినప్పటికీ, నాగ చైతన్యతో మళ్లీ సినిమా చేసే అవకాశం మాత్రం ఇప్పటివరకు రాలేదు.

ఈ విషయాన్ని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగ వంశీ స్వయంగా ప్రస్తావించారు. నాగ చైతన్యతో మరో సినిమా చేయలేదని ఆయనే అడుగుతున్నారని చెప్పారు. అయితే అందుకు సరైన సమయం కోసం వేచిచూస్తున్నామని, నాగ చైతన్య కోసం ఒక భారీ ప్లాన్ ఉందని వెల్లడించారు.

నాగ చైతన్య 25వ సినిమా కోసం ప్రత్యేకంగా పెద్ద సెటప్ సిద్ధం చేస్తున్నామని నాగ వంశీ తెలిపారు. కుదిరితే అదే 25వ సినిమా, లేదంటే ఎప్పుడైనా సరే నాగ చైతన్యతో చేసే సినిమా మాత్రం ఖచ్చితంగా వేరే లెవెల్‌లో ఉంటుందని అన్నారు. తమ బ్యానర్‌ను ప్రారంభించిన తొలి హీరో కావడంతో నాగ చైతన్యపై ప్రత్యేక శ్రద్ధ ఉంటుందని కూడా స్పష్టం చేశారు.

ఇక నాగ చైతన్య కూడా తండేల్ తర్వాత తన కెరీర్‌పై మరింత ఫోకస్ పెంచి సినిమాలు ఎంపిక చేసుకుంటున్నాడు. ప్రస్తుతం విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండుతో ఓ థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా తర్వాత సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో చైతన్య సినిమా దాదాపు కన్ఫర్మ్ అయినట్టే ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

అయితే ఈసారి సితార బ్యానర్‌లో నాగ చైతన్య చేసే సినిమాకు దర్శకుడు ఎవరు అన్నది ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. నాగ వంశీ చెప్పిన “పెద్ద సెటప్” మాటలతో చూస్తే, ఈ ప్రాజెక్ట్ కోసం ఓ క్రేజీ కాంబినేషన్‌ను ప్లాన్ చేస్తున్నారని అర్థమవుతోంది. ప్రస్తుతం సితార, అన్నపూర్ణ బ్యానర్లు కలిసి అఖిల్ అక్కినేనితో లెనిన్ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

నాగ చైతన్య సినిమా గురించి నాగ వంశీ చేసిన తాజా వ్యాఖ్యలు అక్కినేని అభిమానులను ఖుషి చేస్తున్నాయి. లవర్ బాయ్ ఇమేజ్‌ను దాటి డిఫరెంట్ జానర్స్‌లో సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్న చైతన్య, రాబోయే రోజుల్లో తన మైల్‌స్టోన్ 25వ చిత్రంను భారీగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఆ సినిమా ఏ కాంబినేషన్‌లో వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.


Recent Random Post: