నాన్న, నువ్వు చనిపోతావా … దాడి తర్వాత సైఫ్‌ మొదటి స్పందన

Share


ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడి దుండగుడు కత్తితో దాడి చేయడం అందరినీ షాక్‌కు గురిచేసింది. తన పిల్లల రక్షణ కోసం సైఫ్ ప్రాణాలకు తెగించి పోరాడాడు. దుండగుడి చేతిలో కత్తి ఉన్నా కూడా తన కొడుకు తైమూర్‌ను కాపాడేందుకు ప్రయత్నించాడు. దాడిలో గాయపడిన సైఫ్‌ అనేక రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యాడు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

ఆ ఘటన జరిగిన రాత్రి ఆసుపత్రికి వెళ్లేటప్పుడు తైమూర్ కూడా ఆయనతో పాటు ఉండటమే కొత్త ప్రశ్నలకు దారి తీసింది. ఇంట్లో మరికొందరు సభ్యులు ఉన్నా, తైమూర్‌ను ఎందుకు తీసుకెళ్లారు? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.

ఈ విషయంపై స్పష్టతనిస్తూ సైఫ్ అలీ ఖాన్‌ తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరాలు వెల్లడించారు. దాడి జరిగిన సమయంలో తీవ్ర గాయమైందని ముందుగా తాను గుర్తించలేదని, అనంతరం వీపు నుంచి రక్తం కారడం చూసి గాయాన్ని గుర్తించినట్లు చెప్పారు. భార్య కరీనా ఆందోళన చెందుతున్నా, పిల్లలను చూసుకోమని, భయపడొద్దని ఆమెను ధైర్యపరిచినట్లు పేర్కొన్నారు.

తన పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి వెళ్లాలని నిర్ణయించుకున్నానని, అయితే అప్పట్లో ఎవరూ ఫోన్‌లు తీసుకోలేదని తెలిపారు. చివరకు తన సహాయకుడితో కలిసి వెళ్లాలని భావించిన సమయంలో తైమూర్ “నాన్నా.. నువ్వు చనిపోతావా?” అంటూ భయంతో అడిగాడని సైఫ్ పేర్కొన్నారు. చిన్న పిల్లవాడైన తైమూర్ తనను వదలకుండా ఆసుపత్రికి వస్తానని పట్టుబట్టాడని, అప్పుడు తనకు కొడుకు పక్కన ఉన్నంతసేపు ధైర్యంగా ఉంటాననే ఆలోచన వచ్చిందని, అందుకే తనతో తీసుకెళ్లినట్లు వివరించారు.

ఈ ఘటనపై పోలీసులు తీవ్రంగా దర్యాప్తు చేపట్టి, దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. గుర్తింపు పరేడ్‌లో సైఫ్ కుటుంబ సభ్యులు అతడిని గుర్తించారు. ప్రస్తుతానికి అతడిపై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు.

ఇక సైఫ్ అలీ ఖాన్ గాయాల నుంచి పూర్తిగా కోలుకుని త్వరలోనే షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.


Recent Random Post: