నిర్మాతపై హాట్ హీరోయిన్ షాకింగ్ ఆరోపణలు

`బద్రి` ఫేం అమీషా పటేల్ పరిచయం అవసరం లేదు. హృతిక్ రోషన్ (కహోనా ప్యార్ హై)- పవన్ కల్యాణ్ – బాలకృష్ణ- మహేష్ లాంటి అగ్ర హీరోల సరసన కెరీర్ ఆరంభమే నటించింది. అటుపై హిందీ -మరాఠా చిత్రాల్లో నటిస్తూ కెరీర్ బండిని సాగించింది. ఇప్పుడు అమీషా నటించిన సూపర్ హిట్ చిత్రం గదర్ కి సీక్వెల్ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ప్రచారంలో అమీషా తన నిర్మాతపై చేసిన కామెంట్లు వేడెక్కిస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే…

సన్నీ డియోల్ – అమీషా పటేల్ నటించిన గదర్ 2 ఈ సంవత్సరం అత్యంత భారీ అంచనాలతో విడుదలవుతున్న చిత్రాలలో ఒకటి. కొన్నేళ్ల తర్వాత సన్నీ -అమీషా జంట తెరపై మళ్లీ కలుస్తున్నారు. వారిని మరోసారి చూడాలనే ఉత్సాహం చాలా కాలంగా అభిమానుల్లో ఉంది. గదర్ 2లో సకీనా పాత్రలో నటించిన అమీషా పటేల్ చిత్రనిర్మాత అనీల్ శర్మపై తాజా ఆరోపణలు సంచలనంగా మారాయి. సెట్స్ లో దర్శక-నిర్మాత అనిల్ శర్మ వ్యవహారికంపై అమీషా ఆరోపణలు చేసింది. అనిల్ అతని నిర్మాణ బృందం మేకప్ ఆర్టిస్టులు కాస్ట్యూమ్ డిజైనర్లకు చెల్లించాల్సిన రుసుము(పేమెంట్లు)ను సరిగా ఇవ్వలేదని ఆరోపించింది. అంతే కాదు తాను జీ స్టూడియోస్ లో అడుగుపెట్టి ప్రతిదీ క్రమబద్ధీకరించారని నిర్ధారించుకున్నానని కూడా తెలిపింది.

చండీగఢ్ లో గదర్ 2 షూటింగ్ ముగింపు సమయంలో అనిల్ శర్మ అతని ప్రొడక్షన్ హౌస్ టీమ్ కు సరిగా సౌకర్యాలు కల్పించలేదని అమీషా సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు. “మే చివరలో చండీగఢ్ లో జరిగిన గదర్ 2 చివరి షెడ్యూల్ లో అనిల్ శర్మ ప్రొడక్షన్స్ కు సంబంధించి కొన్ని సంఘటనలు ఆందోళనకరం“ అని వ్యాఖ్యానించింది. మేకప్ ఆర్టిస్టులు కాస్ట్యూమ్ డిజైనర్లు ఇతర సాంకేతిక నిపుణులు ఇబ్బందులకు గురయ్యారని అనిల్ శర్మ ప్రొడక్షన్స్ నుండి బకాయిలు సరిగా పొందలేదని అమీషా ఆరోపించారు. దానికి తోడు సిబ్బంది వసతి- రవాణా.. ఆహార బిల్లులను చెల్లించకుండా నడిరోడ్డున నిర్మాత వదిలేసారని అమీషా వెల్లడించింది. చివరిరోజు చండీగఢ్ విమానాశ్రయానికి వెళ్లడానికి వసతులు కల్పించలేదు. అలాగే ఆహార బిల్లులు చెల్లించలేదు. కొందరు తారాగణం సిబ్బందికి ప్రయాణానికి కార్లు కూడా ఏర్పాటు చేయలేదు. వారిని ఒంటరిగా వదిలివేసారు! అయితే మళ్లీ జీస్టూడియోస్ రంగంలోకి దిగి అనిల్ శర్మ ప్రొడక్షన్స్ వల్ల ఏర్పడిన ఈ సమస్యలను సరిదిద్దింది!! అని అమీషా వెల్లడించింది. నిర్మాత అనీల్ శర్మ వల్ల చిత్ర బృందం అనేకసార్లు ఎలా గందరగోళానికి గురైందో అమీషా పటేల్ వరుస ట్వీట్లలో వివరించింది. గదర్ 2 నిర్మాణాన్ని అనిల్ శర్మ ప్రొడక్షన్స్ నిర్వహించిందని దురదృష్టవశాత్తూ అనేకసార్లు తప్పులు జరిగాయని పేర్కొంది. ప్రతిసారీ జీ స్టూడియోస్ సమస్యలను సరిదిద్దుకుంది!! జీ స్టూడియోస్ టీమ్ అత్యున్నత స్థాయి టీమ్ అని కితాబిచ్చింది. ఈ సమస్యను పరిష్కరించినందుకు జీ స్టూడియోస్ కి చెందిన షరీక్ పటేల్ – నీరజ్ జోషి- కబీర్ ఘోష్ – నిశ్చిత్ లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. ఇప్పటివరకూ అమీషా ఆరోపణలపై అనీల్ శర్మ స్పందించలేదు.

మరోవైపు గదర్ 2 టీజర్ ఇటీవల విడుదలైంది. దీనికి అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. శక్తిమాన్ తల్వార్ గదర్ 2 కి రచయిత. కొద్ది రోజుల క్రితం మేకర్స్ `ఉద్ద్ జా కాలే కావ` పాటతో అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచారు. గదర్ 2 ఆగస్ట్ 11న విడుదల కానుంది.


Recent Random Post: