ప్రియదర్శికి బ్రేక్ ఇస్తుందా జాతకం?

Share


వాస్తవానికి ఈ వారం థియేటర్లలోకి రావాల్సిన సినిమా సారంగపాణి జాతకం. టీం మొదట ఇదే ప్రకటించిందీ. కానీ అదే వారం ఓదెల 2 మరియు అర్జున్ సన్నాఫ్ వైజయంతి రూపంలో కాస్త బలమైన పోటీ ఉండడంతో, రిస్క్ తీసుకోవడం కంటే జాగ్రత్తగా ఏప్రిల్ 25కి విడుదల వాయిదా వేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్లు బుస్సెక్కాయి. తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌లో ప్రియదర్శి హీరోగా, రూప హీరోయిన్‌గా నటించారు. వెన్నెల కిషోర్, వైవా హర్ష, నరేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణం వహించగా, ఆయనకి మంచి అభిరుచి ఉన్న నిర్మాతగా పేరుంది.

అవును, మొదట్లో ఈ సినిమాపై పెద్దగా బజ్‌ లేదు. కానీ ట్రైలర్‌ విడుదల తరువాత ట్రాక్ మారిపోయింది. కామెడీకి తోడు ఈసారి ఇంద్రగంటి ఫన్నీ క్రైమ్ ఎలిమెంట్స్‌ని జోడించినట్టు అనిపిస్తోంది. వెన్నెల కిషోర్ చెప్పినట్టు, “కమల్ హాసన్ పుష్పక విమానంను మాటల్లో తీస్తే ఎలా ఉంటుంది?” అనే స్టైల్లో ఈ సినిమా ఉంటుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఇటీవలే కోర్ట్ కేస్ రూపంలో సూపర్ హిట్ అందుకున్న ప్రియదర్శి, ఈసారి సోలో హీరోగా నిలబడాలని చూస్తున్నాడు. సారంగపాణి జాతకం ద్వారా ఆ లక్ష్యం తీరుతుందనే నమ్మకంతో ఉన్నాడు.

కానీ, ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉండటం, ఐపీఎల్ క్రికెట్ జోష్‌లో ఉండటంతో ప్రేక్షకులు థియేటర్లవైపు పెద్దగా రావడం లేదు. ఇప్పటిదాకా ఏప్రిల్‌లో ఒక కూడా బిగ్ బ్లాక్‌బస్టర్ రాలేదు. తమన్నా, కళ్యాణ్ రామ్ సినిమాలు సైతం బుకింగ్స్ పరంగా ఆశించిన స్థాయిలో కనిపించలేదు.

అందుకే, సారంగపాణి జాతకం ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే మంచి మౌత్ టాక్ రావడం కీలకం. గతంలో వరుసగా రెండు సినిమాలు అంచనాలు అందుకోకపోవడంతో ఈ సినిమా విజయం ఇంద్రగంటి మోహనకృష్ణకి చాలా కీలకం. ఇది హిట్ అయితే, ఆయన ప్లాన్ చేస్తున్న ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు మార్గం సాఫీ అవుతుంది.


Recent Random Post: