ఫలితాలు లేకపోయినా మార్కెట్‌లో తగ్గని విజయ్ దేవరకొండ బ్రాండ్

Share


విజయ్ దేవరకొండకు సరైన బ్లాక్‌బస్టర్ హిట్ వచ్చి చాలా కాలమవుతోంది. ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’, ‘టాక్సీవాలా’ తర్వాత ఆయన కెరీర్‌లో వచ్చిన చిత్రాలు హిట్ రేసులో నిలబడలేకపోయాయి. ‘టాక్సీవాలా’ అనంతరం ‘డియర్ కామ్రేడ్’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’, ‘లైగర్’, ‘ఖుషీ’, ‘ది ఫ్యామిలీ స్టార్’ వంటి సినిమాలు చేసినప్పటికీ ఒక్కటీ పూర్తి స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది.

అయితే వరుస ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా విజయ్ దేవరకొండ ఇమేజ్‌కు మాత్రం పెద్దగా ఎలాంటి దెబ్బ తగలలేదు. ఓ సీనియర్ స్టార్ హీరో స్థాయిలోనే ఆయన సినిమాలకు మార్కెట్‌లో డిమాండ్ కొనసాగుతుండటం గమనార్హం. దర్శకులు, నిర్మాతలు ఇప్పటికీ విజయ్‌తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతూనే ఉన్నారు.

ఆ డిమాండ్ ఏ స్థాయిలో ఉందంటే… విజయ్ ఓకే చెప్పకపోయినా, అడ్వాన్సులు ఇచ్చేందుకు నిర్మాతలు ముందుకు వస్తున్నారట. కథ వినకుండానే సూట్‌కేసులు చేతిలో పెట్టుకుని ఇంటి ముందు క్యూ కట్టే స్థాయిలో పరిస్థితి ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ. అలాగే దర్శకులు, రైటర్లు కూడా విజయ్‌ను కలసి కథ చెప్పేందుకు పోటీ పడుతున్నారట. సాధారణంగా ప్లాప్ ఫేజ్‌లో ఉన్న హీరోలకు ఇలాంటి సీన్ కనిపించదు. కానీ విజయ్ విషయంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది.

దీనికి ప్రధాన కారణం… విజయ్ ఏ సినిమా చేసినా, ఆ ప్రాజెక్ట్ చుట్టూ ఏర్పడే హైప్. సినిమా విడుదలకు ముందే ప్రమోషనల్ కంటెంట్, పోస్టర్లు, లుక్స్ ద్వారా భారీ బజ్ క్రియేట్ అవుతోంది. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ నుంచి ఈ మ్యానియా మొదలైందనే చెప్పాలి. ఆ తర్వాత పూరి జగన్నాథ్‌తో చేసిన ‘లైగర్’ రిలీజ్‌కు ముందు ఎంతటి హైప్ క్రియేట్ చేసిందో తెలిసిందే.

‘లైగర్’లో బాక్సర్‌గా విజయ్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘ఖుషీ’లో ఆయన క్లాసిక్ యాంగిల్ మరో హైలైట్‌గా నిలిచింది. డీసెంట్ లుక్‌తో వచ్చిన పోస్టర్లు, ప్రచార చిత్రాలు పాజిటివ్ వైబ్స్‌ను తీసుకొచ్చాయి. అదే తరహాలో ‘ది ఫ్యామిలీ స్టార్’ విషయంలోనూ భారీ ప్రీ-రిలీజ్ హైప్ కనిపించింది.

అదే ఉత్సాహాన్ని ‘కింగ్‌డమ్’ సినిమాతో మరోసారి ఆకాశానికి ఎత్తాడు. విజయ్ లుక్, పోస్టర్లు అన్నీ కూడా “బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే” అన్న స్థాయిలో అంచనాలను పెంచాయి. తాజాగా విడుదలైన ‘రౌడీ జనార్దన్’ గ్లింప్స్ కూడా అదే రేంజ్‌లో హైప్ ఇస్తోంది. కొన్ని గంటల్లోనే రిలీజ్ అయిన ఈ గ్లింప్స్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు.

ఈ స్థాయి హైప్‌నే విజయ్ దేవరకొండ సినిమాలకు బిజినెస్ పరంగా, మార్కెట్ పరంగా పెద్ద ప్లస్‌గా మారుతోంది. ఫలితాలు ఎలా ఉన్నా, మార్కెట్‌లో విజయ్ బ్రాండ్ మాత్రం ఇప్పటికీ స్ట్రాంగ్‌గానే కొనసాగుతోంది.


Recent Random Post: