బన్నీ తపస్సు.. ‘పుష్ప 2’కి త్రివిక్రమ్‌ రివ్యూ

ఏడాది కాలంగా రెగ్యులర్‌గా వార్తల్లో నిలుస్తున్న పుష్ప 2 సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పుష్ప పార్ట్‌ 1 కి అల్లు అర్జున్‌ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును సొంతం చేసుకోవడంతో పాటు సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్‌ ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. తెలుగు సినిమా చరిత్రలో మొదటి సారి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్న అరుదైన రికార్డ్‌ను అల్లు అర్జున్‌ సొంతం చేసుకోవడంతో పుష్ప 2 ఇంకా ఆయన పాత్ర ఎలా ఉంటుంది, సుకుమార్‌ చేసిన మ్యాజిక్‌ ఏంటా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంది.

పుష్ప 2 అంచనాలకు ఏమాత్రం తక్కువ కాకుండా ఉంది అంటూ ఫ్యాన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అల్లు అర్జున్‌ నటనతో మరోసారి పుష్ప 2 సినిమా స్థాయిని పెంచారని ఫ్యాన్స్‌ తో పాటు ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ సైతం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన పుష్ప 2 సినిమా గురించి స్పందించారు. సినిమాకు ఆయన ఇచ్చిన రివ్యూ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. పుష్ప 2 సినిమాపై త్రివిక్రమ్‌ చేసిన వ్యాఖ్యలు సినిమాపై అంచనాలు మరింత పెంచే విధంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

త్రివిక్రమ్‌ సోషల్‌ మీడియా వేదికగా… సినిమాలో ఫహద్‌ పాజిల్‌, రష్మికల నటన చాలా బాగుంది. దేవి శ్రీ ప్రసాద్‌ తన సంగీతంతో ఆకట్టుకున్నారు. సినిమాలో పాటలు చాలా బాగున్నాయి. అన్నింటి కంటే ముఖ్యంగా అల్లు అర్జున్‌ అద్భుతంగా నటించారు. పుష్ప పాత్రలో ఆయన నటించిన తీరును ప్రేక్షకులు అంత ఈజీగా మరచిపోలేరు. బన్నీ సృష్టించిన అద్భుతం నుంచి ప్రేక్షకులు అంత తొందరగా బయట పడటం సాధ్యం కాదు. ఈ సినిమాలో ఆయన నటించలేదు, సినిమా కోసం తపస్సు చేసినట్లు అనిపించింది. ఇది బ్లాక్‌ బస్టర్‌ మూవీ అంటూ పేర్కొన్నారు.

అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ కాంబోలో ఇప్పటి వరకు జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురం లో సినిమాలు వచ్చాయి. మూడు సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్‌ చేయబోతున్న సినిమాకు త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించబోతున్నారు. ఇప్పటికే వీరి కాంబో మూవీ అధికారికంగా ప్రకటన వచ్చింది. గత కొన్నాళ్లుగా త్రివిక్రమ్‌ కథను రెడీ చేసే పనిలో ఉన్నారు. ఆ మధ్య బన్నీ వాసు మాట్లాడుతూ బన్నీ, త్రివిక్రమ్‌ కాంబోలో రాబోతున్న నాల్గవ సినిమా మామూలుగా ఉండదని, భారీ పీరియాడిక్ మూవీగా ఉంటుందని, పాన్ ఇండియా రేంజ్‌లో భారీ ఎత్తున వసూళ్లు సాధించే విధంగా ఉంటుంది అంటూ వ్యాఖ్యలు చేశారు. కనుక వీరి కాంబో మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2025 లో సినిమా ప్రారంభం అయ్యి 2026 కి ప్రేక్షకుల ముందుకు వీరు వస్తారేమో చూడాలి.


Recent Random Post: