బాలయ్య కొత్త సినిమా షూటింగ్ మొదలు

Share


నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా, దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమా తాజాగా రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించింది. ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్‌గా షూటింగ్ మొదలుపెట్టిన చిత్రబృందం ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్‌లో నైట్ షెడ్యూల్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్‌లో బాలకృష్ణ పాల్గొంటూ కీలక సన్నివేశాల చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఆయనతో పాటు ఇతర ప్రధాన పాత్రధారులపై యాక్షన్ సన్నివేశాలు మరియు టాకీ పార్ట్ కూడా చిత్రీకరిస్తున్నారు. దాదాపు రెండు వారాల పాటు ఇదే సెట్‌లో రాత్రి సమయంలోనే షూటింగ్ కొనసాగనున్నట్లు తెలుస్తోంది.

దీనితో ఈ 14 రోజుల పాటు బాలకృష్ణకు నైట్ షూటింగ్ తప్పదని తెలుస్తోంది. సాధారణంగా స్టార్ హీరోలతో నైట్ షెడ్యూల్స్ చాలా అరుదుగా జరుగుతాయి. కొందరు హీరోలు రాత్రి షూటింగ్‌లకు ఆసక్తి చూపకపోవడంతో దర్శకులు కూడా తమ షెడ్యూల్‌లను మార్చుకోవాల్సి వస్తుంది. కానీ బాలకృష్ణ మాత్రం పూర్తిగా దర్శకుడి మాట వినే హీరోగా పేరుగాంచారు. సెట్స్‌పై దర్శకుడు చెప్పిన విధంగా పని చేయడం ఆయన ప్రత్యేకత. సూచనలు ఇవ్వడం, మధ్యలో జోక్యం చేసుకోవడం వంటి విషయాలకు దూరంగా ఉంటూ దర్శకుడికి పూర్తి గౌరవం ఇస్తారు.

నైట్ షెడ్యూల్స్ బాలకృష్ణకు కొత్త విషయం కాదు. తన సినీ ప్రయాణంలో ఇలాంటి అనేక షెడ్యూల్స్‌లో ఆయన ఇప్పటికే పాల్గొన్నారు. ముఖ్యంగా దర్శకుడు బాబీ తెరకెక్కించిన ‘డాకు మహారాజ్’ సినిమా సమయంలో కూడా బాలకృష్ణ పలుమార్లు రాత్రి వేళల్లో షూటింగ్ చేశారు. ఆ సినిమాలోని క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాలు మరియు జైలు నేపథ్యంలోని కీలక సన్నివేశాలను రాత్రిపూటే చిత్రీకరించారు. ఆ సమయంలో కూడా ఆయన ఎలాంటి అసౌకర్యం లేకుండా షూటింగ్‌ను పూర్తి చేశారు.

సినిమా కోసం రాత్రి షూటింగ్ ఉన్నా బాలకృష్ణ అలసటను పట్టించుకోకుండా పూర్తి అంకితభావంతో పనిచేస్తారు. సాధారణంగా ఉదయం త్వరగా లేచి పనులు ప్రారంభించే ఆయన, రాత్రి సమయాన్ని అనవసరంగా వృథా చేయరు. ఎక్కువగా సినిమా సెట్స్‌లో లేదా ఇంట్లోనే సమయాన్ని గడుపుతారు.

ఇటీవల బాలకృష్ణ నటించిన ‘అఖండ 2’ భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా స్థాయిలో విడుదలైనప్పటికీ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో తదుపరి సినిమాతో ఘన విజయాన్ని సాధించాలని బాలయ్య మరింత కసితో పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త ప్రాజెక్ట్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉత్సాహం ఆయనలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వేడిలో బాలకృష్ణ రాత్రి షూటింగ్‌లో పాల్గొనడం ఏమాత్రం ఆశ్చర్యకరం కాదు. అవసరం అయితే 24 గంటలు కూడా షూటింగ్‌లో పాల్గొనేంత అంకితభావం ఆయనకు ఉంది.


Recent Random Post: