బాహుబలి లేనిదే పొన్నియన్ సెల్వన్ ఉండేది కాదు: మణిరత్నం

Share


భారతీయ సినిమా చరిత్రలో కొత్త పేజీ రాసిన సినిమా ‘బాహుబలి’. విడుదలై దశాబ్దం దాటినా కూడా ఆ సినిమా క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ “బాహుబలి మేనియా” కొనసాగుతూనే ఉంది. ఈ చిత్రంతో దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటారు. తెలుగు దర్శకుడు కలల్ని ఎంత పెద్ద కాన్వాస్‌లో సాకారం చేయగలడో రాజమౌళి ఈ చిత్రంతో నిరూపించారు.

‘బాహుబలి’తోనే పాన్‌ ఇండియా ట్రెండ్‌ మొదలైంది. అంతేకాదు, సీక్వెల్స్‌ ట్రెండ్‌ కూడా అదే సినిమాతో ప్రారంభమైంది. అప్పటి వరకు ఒక సినిమాను రెండు భాగాలుగా తీర్చిదిద్దాలని ఎవరు ఆలోచించలేదు. కానీ ఆ ఆలోచనను మొదటిసారి అమలు చేసిన వ్యక్తి రాజమౌళే. ఆయన చేసిన ఈ సరికొత్త ప్రయోగం తర్వాత అనేక మంది దర్శకులు ప్రీక్వెల్స్‌, సీక్వెల్స్‌ దారిలో నడుస్తున్నారు.

ఇటీవల ‘బాహుబలి ది ఎపిక్’ పేరుతో రెండు పార్ట్‌లను కలిపి అక్టోబర్‌ 31న రీ రిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ వెర్షన్‌ కూడా రికార్డు స్థాయి కలెక్షన్లు సాధిస్తోంది. ఇదే సమయంలో దర్శకుడు మణిరత్నం గతంలో చేసిన వ్యాఖ్యలు మరోసారి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

2022లో జరిగిన ఎంటర్‌టైన్‌మెంట్‌ సమ్మిట్‌లో మణిరత్నం మాట్లాడుతూ, “ఒక సినిమాను రెండు భాగాలుగా తీర్చిదిద్దవచ్చని రాజమౌళి ‘బాహుబలి’తో చూపించారు. ఆయన సినిమానే నాకు ప్రేరణ. బాహుబలి లేనిదే పొన్నియన్‌ సెల్వన్‌ ఉండేది కాదు. నేను ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళికీ చెప్పాను. ఆయన ప్రయత్నమే నన్ను రెండు పార్ట్‌లుగా ‘పొన్నియన్‌ సెల్వన్’ తీయడానికి ధైర్యం ఇచ్చింది. రాజమౌళి వల్లే భారతీయ సినిమాలు ఇంటర్నేషనల్‌ లెవల్‌లో గుర్తింపు పొందాయి” అని తెలిపారు.

ఆ సమయంలో చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి వైరల్‌ అవుతుండగా, సినీప్రేమికులు “రాజమౌళి వల్లే పాన్‌ ఇండియా సినిమాలు, సీక్వెల్స్‌ సంస్కృతి వచ్చాయి. అందుకే ఆయనను దర్శకధీరుడు అంటారు” అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


Recent Random Post: