బిగ్‌ స్టోరీ: బలవన్మరణం.. కాదు ఏ సమస్యకీ పరిష్కారం.!

సినిమా తారలు తెరపై వెలిగిపోతుంటారు.. మేకప్‌ తీసేస్తే వాళ్ళూ మనలాంటివాళ్ళే. సమస్యలు అందరికీ వుంటాయ్‌.. అసలంటూ సమస్యనే లేకపోతే.. మనిషి జీవితానికి అర్థమేముంటుంది.? సినిమాల్లో కథానాయకులు, నాయికలు.. ఎన్నెన్నో సమస్యలకు పరిష్కారం చూపుతుంటారు. మరి, రియల్‌ లైఫ్‌లో రీల్‌ లైఫ్‌ హీరోలు కావొచ్చు.. హీరోయిన్లు కావొచ్చు.. ఎలా వుంటారు.? ఇంకెలా వుంటారు.. వాళ్ళూ మనలాంటి మనుషులే కదా.!

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుట్‌ ఈ రోజు బలవన్మరణానికి పాల్పడ్డాడు. గత కొద్ది నెలలుగా ఆయన తీవ్ర మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. అదే నిజమైతే, ఈ మధ్యకాలంలో ఆ సన్నిహితులెవరూ ఆయన్ని ఓదార్చలేకపోయారా.? కరోనా కాలం కదా.! ఒకర్ని ఇంకొకరు కలిసే పరిస్థితి లేకపోవడంతో.. ఆ ఒంటరితనం కూడా బహుశా సుశాంత్‌ని బలవన్మరణం వైపు నడిపించిందేమో.! ఇది కూడా ఓ కారణం అయి వుండొచ్చు.

కొద్ది రోజుల క్రితమే కన్నడ సినిమా ఓ ప్రముఖ నటుడ్ని కోల్పోయింది. గుండె పోటు కారణంగా కన్నడ హీరో చిరంజీవి సర్జా హఠాన్మరణం చెందిన విషయం విదితమే. అది మర్చిపోకముందే, సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుట్‌ మరణం.. బాలీవుడ్‌నే కాదు.. మొత్తంగా సగటు సినీ అభిమానిని తీవ్రంగా కలచివేస్తోంది. నిజానికి, కెరీర్‌ పరంగా సుశాంత్‌ సింగ్‌కి ఒత్తిడి అంటూ ఏమీ లేదు. ఆయన పలు సినిమాల్లో నటిస్తున్నాడు. ఆర్థిక సమస్యల్లాంటివేమీ లేవని సన్నిహితులు చెబుతున్నారు. అయినా, సుశాంత్‌ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో ఎవరికీ అర్థం కావడంలేదు.

ఇదిలా వుంటే, ‘కరోనా వైరస్‌ నేపథ్యంలో పరిస్థితులు తారుమారయ్యాయి.. భవిష్యత్తు భయానకంగా వుండబోతోంది.. సినీ పరిశ్రమపై ఈ ఎఫెక్ట్‌ చాలా ఎక్కువగా పడబోతోంది..’ అంటూ వెల్లువెత్తుతున్న అభిప్రాయాలతో, సినీ పరిశ్రమలో చాలామంది తీవ్ర ఒత్తిడికి గురవుతున్న మాట వాస్తవం. నిర్మాతలు కావొచ్చు, దర్శకులు కావొచ్చు, హీరోలు, హీరోయిన్లు కావొచ్చు.. ఇతర నటీనటులు కావొచ్చు.. దాదాపుగా అందరిదీ ఇదే పరిస్థితి. ఆ మాటకొస్తే, అన్ని రంగాల్లోనూ ఇదే దుస్థితి నెలకొంది.

మీడియా రంగం అయినా, పారిశ్రామిక రంగం అయినా.. ఎటు చూసినా, భవిష్యత్తుపై ఆశలు కన్పించడంలేదు. అలాగని చావు ఏ సమస్యకైనా పరిష్కారం చూపిస్తుందని అనుకోగలమా.? బతికి సాధించాల్సిందే. అవును, మనిషి మనుగడకి అనేక సవాళ్ళు నిత్యం ఎదురవుతూనే వుంటాయి.. ఆ సవాళ్ళను స్వీకరించగలిగినప్పుడే.. వాటిని ధైర్యంగా ఎదుర్కోగలిగినప్పుడే.. మన మనుగడ సాధ్యమవుతుంది.

ఏదిఏమైనా, సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుట్‌ మరణం అత్యంత విషాదకరం. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌ అన్న తేడాల్లేకుండా.. సినీ ప్రముఖులంతా సుశాంత్‌ మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు, ఒకరికొకరు ధైర్యం చెప్పుకోవాలంటూ సోషల్‌ మీడియా వేదికగా ఆత్మహత్యల నివారణకు సంబంధించిన మెసేజ్‌లను పోస్ట్‌ చేస్తున్నారు. అత్యంత దురదృష్టకరమైన విషయమేంటంటే, సుశాంత్‌ నటించిన ‘చిచోరే’ సినిమాలో ఆత్మహత్యకు సంబంధించి కీలక సన్నివేశాలున్నాయి. అలాంటి సినిమాలో నటించిన సుశాంత్‌, ఆత్మహత్యకు పాల్పడ్డాడంటే, అతనెంత మానసిక వ్యధను అనుభవించి వుంటాడో ఈ మధ్యకాలంలో.


Recent Random Post: