
బెట్టింగ్ యాప్స్ వ్యవహారం రోజురోజుకు మరింత సీరియస్ అవుతోంది. ఈ యాప్స్ ప్రభావంతో పలువురు ఆత్మహత్యలు చేసుకున్న నేపథ్యంలో పోలీసులు కఠినంగా వ్యవహరించడం ప్రారంభించారు. ప్రత్యేకంగా, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన ప్రముఖులపై దృష్టి సారించి, వారిపై కేసులు నమోదు చేసి, విచారణకు పిలుస్తున్నారు.
ఈ నేపథ్యంలో, గురువారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో యాంకర్ విష్ణుప్రియ హాజరై పోలీసుల విచారణలో కీలక వివరాలు వెల్లడించినట్లు సమాచారం. సమగ్ర దర్యాప్తులో ఏ అంశాన్ని దాచిపెట్టకుండా స్పష్టమైన సమాచారం అందించినట్లు తెలుస్తోంది.
విష్ణుప్రియ తాను బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన విషయాన్ని అంగీకరించడమే కాకుండా, ఆ ప్రమోషన్ ద్వారా భారీ మొత్తంలో పారితోషికం అందుకున్నట్లు ఒప్పుకున్నట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి. 15 బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేసినట్లు ఆమె పేర్కొనగా, తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా వాటిని ప్రచారం చేసినట్లు తెలిపింది.
అంతేకాదు, తనకు తెలిసిన అన్ని విషయాలను చెప్పానని, ఇందుకు మించి తనకు ఎలాంటి సమాచారం తెలియదని విష్ణుప్రియ స్పష్టం చేసినట్లు సమాచారం. దర్యాప్తులో భాగంగా, పోలీసులు ఆమె బ్యాంక్ స్టేట్మెంట్లను పరిశీలించేందుకు, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.
పోలీసుల నోటీసుల మేరకు గురువారం ఉదయం తన న్యాయవాదిని వెంటబెట్టుకుని విష్ణుప్రియ పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు హాజరయ్యింది. విచారణ అనంతరం మధ్యాహ్నం ఆమెను పోలీసులు విడిచిపెట్టారు.
ఈ కేసులో మరిన్ని వివరాలు త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశముంది.
Recent Random Post:















