
క్రీడాభిమాని మాత్రమే కాదు, స్పోర్ట్స్ బైక్‌లకు కూడా ప్రత్యేకమైన అభిరుచి గల వ్యక్తి మాధవన్. ప్రత్యేకించి కొత్త మోడళ్లపై ఆసక్తిగా ఉండే ఆయన తాజాగా మరో ఖరీదైన బ్రాండ్‌డ్ బైక్‌ను సొంతం చేసుకున్నాడు. ఇటీవల తల అజిత్ దుబాయ్ కార్ రేస్ గెలవగానే అభినందించిన మొదటి వ్యక్తిగా వార్తల్లో నిలిచిన మ్యాడీ, ఇప్పుడు తన కొత్త బైక్ కొన్న వార్తతో మళ్లీ హాట్ టాపిక్ అయ్యాడు.
ప్రఖ్యాత ఆస్ట్రియన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ బ్రిక్ట్సన్ మోటార్‌సైకిల్స్ తాజాగా భారత మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ బ్రాండ్‌లో మొదటి బ్రిక్ట్సన్ క్రోమ్‌వెల్ 1200 బైక్‌ను ప్రముఖ నటుడు ఆర్. మాధవన్ కొనుగోలు చేయడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బ్రిక్ట్సన్ సంస్థ తమ నూతన మోడళ్లను అధికారికంగా మార్కెట్లో విడుదల చేయడం, ప్రముఖులు ఈ బ్రాండ్‌ను ఎంచుకోవడం, భారత మార్కెట్‌పై వారి నిబద్ధతను స్పష్టంగా తెలియజేస్తోంది.
ఈ బ్రాండ్ హై-ఎండ్ ప్రీమియం రేంజ్ మోటార్‌సైకిళ్లను భారతదేశానికి పరిచయం చేయడానికి మోటోహౌస్ సంస్థతో కలిసి పనిచేస్తోంది. ప్రస్తుతం బెంగళూరు, కొల్హాపూర్, గోవా, అహ్మదాబాద్, సాంగ్లిలలో ఇప్పటికే బ్రిక్ట్సన్ షోరూమ్‌లు ప్రారంభమయ్యాయి. త్వరలో జైపూర్, మైసూరు, కోల్‌కతా, పూణే, నవి ముంబైలో కొత్త డీలర్‌షిప్‌లు రానున్నాయి.
కొత్త బైక్‌ను అందుకున్న మాధవన్, తన మోటార్‌సైకిల్ రైడింగ్ ప్యాషన్ గురించి మాట్లాడాడు. “ఈ బైక్ రెట్రో లుక్ అదిరిపోయిందని, ప్రీమియం ఫీచర్లతో రైడింగ్‌ను కొత్త లెవల్‌కు తీసుకెళ్తుంద”ని మ్యాడీ ప్రశంసించాడు. అత్యాధునిక సాంకేతికతతో రూపుదిద్దుకున్న ఈ ప్రీమియం మోటార్‌సైకిళ్లు ఖచ్చితంగా స్పోర్ట్స్ బైక్ లవర్స్‌ను ఆకర్షిస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
బ్రిక్ట్సన్ క్రోమ్‌వెల్ 1200 బైక్ రూ. 7,84,000 (ఎక్స్-షోరూమ్) ధరకే లభించనుండగా, ఇది 500cc నుండి 1200cc సెగ్మెంట్లో అత్యంత పోటీగల మోడళ్లలో ఒకటిగా నిలవనుంది. మార్కెట్లో బైక్ ఎంట్రీతో పాటు మాధవన్ ప్రచారం మరింత ఊపందుకుంటున్నందున, ఈ మోడల్ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ లాంటి దిగ్గజ బ్రాండ్లకు గట్టి పోటీ ఇస్తుందా? లేదా? వేచి చూడాలి!
Recent Random Post:















