రాజమౌళి vs అనిల్ రావిపూడి: ఓటమి ఎరుగని దర్శకుల సక్సెస్ జోరు

Share


స్టార్ హీరో అయినా, యంగ్ హీరో అయినా… ఒక సినిమా హిట్ కావాలంటే అసలైన కీలక పాత్ర పోషించేది డైరెక్టర్‌నే. కథను ఆలోచించడం నుంచి సెట్స్‌పైకి తీసుకెళ్లడం, నిర్ణయించిన బడ్జెట్‌లో పూర్తి చేయడం, అనుకున్న సమయానికి విడుదల చేయడం వరకు ప్రతిదీ ఒక పెద్ద ఛాలెంజ్‌. డైరెక్టర్‌గా వచ్చిన అవకాశాలను సక్సెస్‌లుగా మలుచుకుంటేనే కెరీర్ స్ట్రాంగ్ అవుతుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో అలాంటి ఓటమి ఎరుగని దర్శకుడిగా రాజమౌళి పేరు గట్టిగా వినిపిస్తుంది.

తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి. ఆయన రాజముద్రతో సినిమా వస్తుందంటే సూపర్ హిట్ అన్న నమ్మకం ప్రేక్షకుల్లో బలంగా ఉంది. ‘బాహుబలి’తో తెలుగు సినిమాను వరల్డ్ సినిమాల సరసన నిలబెట్టారు రాజమౌళి. భారీ బడ్జెట్‌, భారీ విజన్‌, అంతే భారీ ఫలితాలు… ఇవన్నీ ఆయన సినిమాల ప్రత్యేకత. సినిమాలకు మూడు, నాలుగు సంవత్సరాలు పడినా ఫలితం మాత్రం రికార్డులే అన్న సంగతి తెలిసిందే.

అయితే రాజమౌళి తర్వాత తెలుగులో ఓటమి ఎరుగని మరో దర్శకుడిగా దూసుకెళ్తున్న పేరు అనిల్ రావిపూడి. ‘పటాస్’ నుంచి ఈరోజు విడుదలైన ‘మన శంకర వరప్రసాద్ గారు’ వరకు అనిల్ రావిపూడి సక్సెస్ మేనియా కొనసాగుతోంది. ఇప్పటివరకు చేసిన తొమ్మిది సినిమాలూ హిట్లుగా నిలవడం ఆయన ప్రత్యేకత.

రాజమౌళి ప్రతి సినిమాను ఒక గ్రాండ్ ఎక్స్‌పీరియెన్స్‌గా మలుస్తే… అనిల్ రావిపూడి మాత్రం సింపుల్ కథలతో ప్రేక్షకులను ఫుల్ ఎంటర్‌టైన్ చేయడమే తన టార్గెట్‌గా పెట్టుకున్నాడు. ‘పటాస్’ నుంచి అదే పంథాను ఫాలో అవుతూ వస్తున్నాడు. అనిల్ రావిపూడి సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ నిర్భయంగా థియేటర్లకు వెళ్లి ఎంజాయ్ చేసే పరిస్థితి ఏర్పడింది. థియేటర్లకు ఫ్యామిలీ ఆడియన్స్ రావడం తగ్గిందని ఎంత చెప్పినా… పండుగ సీజన్‌లో అనిల్ సినిమా వస్తే మాత్రం థియేటర్లు కళకళలాడుతాయి.

రాజమౌళితో పోలిక కాదు కానీ… ఆయన మూడు, నాలుగు ఏళ్లలో ఒక భారీ సినిమా చేసి 400–500 కోట్ల మార్కెట్‌ను టచ్ చేస్తే, అనిల్ రావిపూడి ప్రతి సంక్రాంతికి ఒక సినిమా తీసుకొచ్చి కంటిన్యూస్ హిట్లతో దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఈ ఇద్దరు దర్శకులు ఫెయిల్యూర్ అన్న మాటే వినలేదు.

సినిమాపై ఉన్న కమిట్మెంట్‌, కథను తెరపైకి తీసుకెళ్లే పర్ఫెక్షన్‌, ఆడియన్స్ పల్స్‌ను అర్థం చేసుకునే తెలివి… ఇవే రాజమౌళి, అనిల్ రావిపూడిలను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. భారీ విజన్ సినిమాలతో రాజమౌళి, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్‌తో అనిల్ రావిపూడి… ఇద్దరూ తమ తమ స్టైల్‌లో తెలుగు పరిశ్రమకు మరిన్ని సక్సెస్‌లు అందించాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.


Recent Random Post: