
తెలుగు సినిమా గర్వించే దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఊహించని వివాదంలో చిక్కుకున్నారు. ప్రముఖ నిర్మాత, ఆయన సుదీర్ఘ స్నేహితుడు ఉప్పలపాటి శ్రీనివాసరావు చేసిన సంచలన ఆరోపణలు సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. శ్రీనివాసరావు తన జీవితాన్ని రాజమౌళి నాశనం చేశాడని ఆరోపిస్తూ ఒక సెల్ఫీ వీడియో, లేఖను విడుదల చేశారు.
శ్రీనివాసరావు వివరణ ప్రకారం, తాను యమదొంగ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేసిన తర్వాత, రాజమౌళి తనను పూర్తిగా దూరం పెట్టాడని తెలిపారు. 34 ఏళ్ల స్నేహం ఉన్నప్పటికీ, ఓ మహిళ కారణంగా తనను విస్మరించారని ఆరోపించారు. ఇకపై తాను బతకలేనని, తన మరణానికి రాజమౌళే కారణమని లేఖలో పేర్కొన్నారు.
తన వీడియోలో శ్రీనివాసరావు మరో కీలక విషయాన్ని బయటపెట్టారు. “రాజమౌళి దర్శకుడు అవ్వక ముందు, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. రాజమౌళి కూడా ఆమెను ప్రేమించాడు. నా కెరీర్ గురించి ఆలోచించి త్యాగం చేయమని చెప్పాడు. నమ్మకంతో త్యాగం చేశాను. కానీ కొన్నాళ్ల తర్వాత, నన్ను టార్చర్ చేయడం మొదలు పెట్టాడు. నా వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితం అతని వల్ల నాశనం అయింది. ఆయన వల్లే నేను ఇప్పటికీ బ్యాచిలర్‌గా ఉన్నాను” అని తెలిపారు.
ఇదే కాకుండా, రాజమౌళి ఇండస్ట్రీలో ఎదగడానికి ఇతర దర్శకులపై క్షుద్రపూజలు చేయించాడని, తనను సినిమాల నుంచి తొలగించేందుకు ప్రయత్నించాడని శ్రీనివాసరావు ఆరోపించారు. ఈ వ్యవహారంపై పోలీసులు సుమోటో కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ, రాజమౌళికి లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం రాజమౌళి ఎస్‌ఎస్‌ఎంబీ29 ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు. కానీ, ఈ ఆరోపణలపై ఇంకా ఎటువంటి అధికారిక స్పందన రాలేదు. శ్రీనివాసరావు తన వీడియోను “ఇది నా మరణ వాగ్మూలం” అంటూ విడుదల చేయడం మరింత సంచలనంగా మారింది. వీడియో విడుదల తర్వాత ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడంతో, ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారన్నది తెలియని పరిస్థితి.
ఈ ఆరోపణల వెనుక నిజమెంత? ఇది పూర్తిగా వ్యక్తిగత అంశమేనా? లేక మరేదైనా కారణం ఉందా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. పోలీసులు దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి!
Recent Random Post:















