‘రాజాసాబ్’ పార్ట్-2పై మారుతి క్లారిటీ.. ట్రైలర్‌లోనే హింట్!

Share


ఇండియన్ సినిమాలో కథను రెండు భాగాలుగా తెరకెక్కించడం, సీక్వెల్స్‌ను ప్లాన్ చేయడం అనే ట్రెండ్‌కు ‘బాహుబలి’తో బలమైన ఊపొచ్చింది. ఆ ప్రభావం ఇప్పటికీ కొనసాగుతుండగా, ముఖ్యంగా రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల విషయంలో సీక్వెల్ అనేది దాదాపు గ్యారంటీగా మారింది. ‘సలార్’, ‘కల్కి’ చిత్రాలకు ఇప్పటికే సీక్వెల్స్ లైన్లో ఉండగా, ‘ఫౌజీ’కి కూడా పార్ట్-2 ఉంటుందని అధికారికంగా వెల్లడైంది.

ఈ నేపథ్యంలో ప్రభాస్ తాజా చిత్రం ‘రాజాసాబ్’కు పార్ట్-2 ఉంటుందా లేదా అనే అంశంపై ఆసక్తి నెలకొంది. దీనిపై దర్శకుడు మారుతి తాజాగా స్పష్టత ఇచ్చారు. ట్రైలర్‌లో కనిపించే ‘జోకర్’ షాట్‌ను పార్ట్-2కు లీడ్‌గా ఉద్దేశపూర్వకంగా పెట్టినట్లు ఆయన తెలిపారు. అయితే ప్రస్తుతం పార్ట్-2కు సంబంధించి పూర్తి స్క్రిప్ట్ ఏదీ సిద్ధంగా లేదని కూడా స్పష్టం చేశారు.
ప్రస్తుత చిత్రానికి లీడ్ మాత్రమే ఇచ్చామని, సినిమా ఫలితం, ప్రభాస్ డేట్స్ అన్నీ అనుకూలంగా ఉంటేనే పార్ట్-2పై నిర్ణయం తీసుకుంటామని మారుతి అన్నారు. ముఖ్యంగా రాజాసాబ్-2 కోసం ఇప్పటి కథను సాగదీయడం లాంటి ప్రయత్నం చేయబోమని, కథ విషయంలో తనకు, ప్రభాస్‌కు పూర్తి స్పష్టత ఉందని ఆయన భరోసా ఇచ్చారు. కథను అనవసరంగా లాగుతారేమో అనే భయానికి తావులేదని స్పష్టం చేశారు.

ఇదివరకే నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కూడా ‘రాజాసాబ్’ ప్రపంచం కొనసాగుతుందని చెప్పినా, సీక్వెల్‌పై స్పష్టత ఇవ్వలేదు. తాజా మారుతి వ్యాఖ్యలతో చూస్తే, ముందుగా ఈ సినిమాకు ప్రేక్షకుల స్పందనను గమనించి, అవసరమైతే పూర్తిగా కొత్త కథతో ‘రాజాసాబ్-2’ను రూపొందించే అవకాశం ఉందని అర్థమవుతోంది. ఈ నెల 9న సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న ‘రాజాసాబ్’ ఎలాంటి ఫలితం సాధిస్తుందో వేచి చూడాల్సిందే.


Recent Random Post: