రాశీఖన్నా ఆవేదన: సినిమాల్లో స్త్రీలపై కొనసాగుతున్న వివక్ష

Share


ప్రపంచం వేగంగా మారుతున్న కొద్దీ, మహిళల ఆలోచనలలో, జీవనశైలిలో, ధైర్యంలో కూడా అపారమైన మార్పులు చోటు చేసుకున్నాయి. విద్య, అవగాహన, ఆర్థిక స్వావలంబన—ఈ మూడు కలిసి స్త్రీని అసాధ్యాన్ని సాధ్యం చేసే స్థాయికి తీసుకెళ్లాయి. ఇప్పుడు మహిళలు పురుషుల కంటే వెనక కాకుండా అనేక రంగాల్లో ముందంజలో నిలుస్తున్నారు. ఆకాశాన్ని జయించగా, అంతరిక్షాన్ని సైతం తాకుతున్నారు.

అయితే ఇంత ఎదుగుదలకు కూడా పురుషాధిక్య భావజాలం ఉన్న కొందరి దృష్టిలో మహిళలపై ఇప్పటికీ పాతపద్దతుల్లానే తీర్పులు ఉంటాయి. ధైర్యంగా మాట్లాడితే ‘అహంకారి’, హక్కులు కోరితే ‘దుర్మార్గురాలు’ అనే ముద్రలు వేస్తారు. కళారంగంలోనూ ఇది తరచుగా కనిపించే అంశమే. ప్రతి దశలోనూ కథానాయికల చిత్రణ మారుతూ వచ్చింది.

ఒకప్పుడు మహిళను సెడక్టివ్, వ్యాంప్, ఐటమ్ గర్ల్‌లాంటి కోణాల్లో మాత్రమే చూపించే ట్రెండ్ ఉండేది. 90లలో గ్లామర్‌కు పెద్దపీట వేశారు. 2000–2010 మధ్యలో పొగతాగే, మద్యం సేవించే, నైట్‌క్లబ్‌లకు వెళ్లే అర్బన్ వుమన్ పాత్రలు ట్రెండ్ అయ్యాయి. కానీ ఆ తరువాత కథలు మారాయి, హీరోయిన్ల ప్రాధాన్యం పెరిగింది, కేంద్రకథల్లో నాయికల శక్తిని చూపించే ప్రయత్నాలు మొదలయ్యాయి.

ఈ మార్పులో అనుష్క, నయనతార, కీర్తి సురేష్, సమంత, రష్మిక వంటి నటి మణులు దక్షిణాదిలో ప్రత్యేకస్థానం సంపాదించగా, బాలీవుడ్‌లో దీపిక, ఆలియా, కత్రినా వంటి నాయికలు స్పై ఏజెంట్లు, పోలీస్ అధికారులు వంటి పవర్‌ఫుల్ పాత్రల్లో మెరుస్తున్నారు. పురుషుల పాత్రలకు ధీటుగా నిలిచి సత్తా చాటుతున్నారు.

అయితే, ఈ పురోగతికి మధ్యలోనూ వివక్ష మిగిలే ఉందని తాజాగా నటి రాశీఖన్నా వ్యాఖ్యానించింది. సినిమాల్లో ఇంకా మహిళలను ఆటవస్తువుల్లా చూపించే ధోరణి కొనసాగుతూనే ఉందని, తాను ఆశించిన స్థాయిలో మహిళా పాత్రల ఎదుగుదల కనిపించడం లేదని తెలిపింది. ఇది కేవలం ఒక్క పరిశ్రమలోనే కాదు, అన్ని చిత్రరంగాల్లోనూ కనిపించే సమస్యేనని ఆమె చెప్పింది.

ఇప్పటికే అనేక నటి మణులు కూడా ఇదే అంశాన్ని ముందు పెట్టారు. గతంలో రిచా చద్దా కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం రాశీఖన్నా హిందీలో బ్రిడ్జ్, తాల్కోన్ మెయిన్ ఏక్ చిత్రాల్లో నటిస్తోందీ. అంతేకాక, కొత్త కథలు వింటున్నట్టు, వాటిలో కొన్ని త్వరలో సైన్ చేయనున్నట్టు సమాచారం.

మహిళల పట్ల ఉన్న చూపు, వారి పాత్రల పట్ల ఉన్న అవగాహన మరింత మెరుగుపడాలనే ఆకాంక్షతో రాశీఖన్నా చేసిన వ్యాఖ్యలు పరిశ్రమలో మరోసారి చర్చకు దారితీశాయి.


Recent Random Post: