అనుకున్నదే జరిగింది. ప్రముఖ జర్నలిస్టు.. రిపబ్లిక్ టీవీ చానల్ చీఫ్ అర్నాబ్ గోస్వామిని ముంబయి.. రాయ్ గడ్ పోలీసులు అరెస్టు చేశారు. గడిచిన కొద్ది రోజులుగా అర్నాబ్ అరెస్టుపై పలు ఊహాగానాలు వెలువడుతున్నాయి. తన మాటలతో.. వార్తలతో మహారాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర ఆగ్రహం తెప్పించిన ఆయన ఒక కేసు విషయంలో అరెస్టు అయ్యారు. ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్యకు కారణమన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న అర్నాబ్ ను ఆయన ఇంట్లోనే అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా అక్కడ చోటు చేసుకున్న పరిణామాలు చూసినప్పుడు అధికారం వ్యవస్థల్ని ఎలా డామినేట్ చేస్తుందన్న విషయాన్ని చెప్పకనే చెప్పేస్తుందని చెప్పాలి. బుధవారం ఉదయం ఆర్నాబ్ ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయన్ను బలవంతంగా అరెస్టు చేసినట్లుగా చెబుతున్నారు. ఐపీసీ సెక్షన్ 306 కింద అర్నాబ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆ సందర్భంలో వ్యవహరించిన తీరును పలువురు తప్పు పడుతున్నారు.
ఆర్నాబ్ సతీమణి సమ్యబ్రాతా రే చెప్పిన దాని ప్రకారం చూస్తే.. పోలీసులు అర్నాబ్ ను కొట్టి.. జుట్టుపట్టి లాక్కెళ్లారని ఆరోపించారు. కొద్దిగా టైం కావాలని అడిగినా ఇవ్వలేదని.. లాయర్ వచ్చే వరకు వేచి ఉండాలని కోరినా ఒప్పుకోలేదని.. చివరకు మంచినీళ్లు అడిగినా ఇవ్వలేదన్నారు. ఇంత దౌర్జన్యంగా అరెస్టు చేయాలని అని ఆమె ప్రశ్నిస్తున్నారు.
అర్నాబ్ అరెస్టుకు సంబంధించిన రిపబ్లిక్ చానల్ లో ప్రసారమైన విజువల్స్ ప్రకారం చూస్తే.. ఆయన్ను మొదట కారులో ఉంచి.. ఆ పై వ్యాన్ లోకి నెట్టారు. వ్యాన్ లోకి తీసుకెళ్లే సమయంలో తన ఇంటి లోపల తనపైనా.. తన కుటుంబసభ్యుల పైనా దాడి జరిగినట్లుగా అర్నాబ్ మీడియాకు చెప్పటం గమనార్హం.
ఇంటీరియర్ డిజైనర్ అన్వే నాయక్ ను ఆత్మహత్య చేసుకోవటానికి అర్నాబ్ గోస్వామి పురికొల్పినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన్ను అరెస్టు చేసేందుకు 20 మంది పోలీసులు వెళ్లారని.. ఆ సందర్భంగా వారు ఏకే 47 సెమీ ఆటోమేటిక్ ఆయుధాలతో దాడి చేసినట్లుగా రిపబ్లిక్ చానల్ పేర్కొంది. అర్నాబ్ అరెస్టు కోసం ఎన్ కౌంటర్ స్పెషలిస్టు సచిన్ వాజ్ ను పంపినట్లుగా పేర్కొన్నారు. అరెస్టు చేసిన అనంతరం మహారాష్ట్రలోని రాయ్ గడ్ కు బలవంతంగా తీసుకెళ్లినట్లుగా పేర్కొంది.
Recent Random Post: