లెజెండరీ ప్రిన్స్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కనిపించబోతున్నారా?.. చరణ్ తో ఓ ఫేమస్ నవల ఆధారంగా భారీ సినిమా తెరకెక్కడానికి సన్నాహాలు జరుగుతున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వివరాల్లోకి వెళితే.. అమిష్ త్రిపాఠి ఫేమస్ ఇంగ్లీష్ నవల `లెజెండ్ ఆఫ్ సుహెల్ దేవ్ : ది కింగ్ హూ సేవ్డ్ ఇండియా` ఆధారంగా ఓ సినిమాని తెరపైకి తీసుకురాబోతున్నారట. లెజెండరీ ప్రిన్స్ పాత్రలో రామ్ చరణ్ నటించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే బాలీవుడ్ కు చెందిన ఓ ప్రముఖ భారీ ప్రొడక్షన్ హౌస్ రామ్ చరణ్ ని ఇటీవలే సంప్రదించిందని ముంబై మీడియా లో వరుస కథనాలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన `RRR`లో రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించి అబ్బురపరిచిన విషయం తెలిసిందే. ఈ పాత్రని ఉత్తరాది వారు శ్రీరాముడుగా భావించడంతో అక్కడి జానాల్లో రామ్ చరణ్ పాపులర్ అయ్యాడు.
ఇదే కాకుంగా రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన ఆ మూవీ అక్కడ కూడా రికార్డులు సృష్టిస్తుండటంతో చరణ్ తో `లెజెండ్ ఆఫ్ సుహెల్ దేవ్ : ది కింగ్ హూ సేవ్డ్ ఇండియా` నవల ఆధారంగా భారీ సినిమాని తెరపైకి తీసుకురావాలని బాలీవుడ్ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇది ఎంత వరకు సాధ్యం అన్నదానిపై ఇప్పడు చర్చ జరుగుతోంది. ఈ కథని నేటి తరానికి అర్థమయ్యేలా అందించడం కష్టమనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.
అసలు రాజా సుహెల్ దేవ్ ఎవరు? ఏంటీ ఆయన కథ అంటే ఆసక్తికర విషయాలే బయటకు వస్తున్నాయి. 1033లో ఘాజీ సయ్యద్ సలార్ మక్సూద్ దండయాత్ర చేసినప్పుడు సామంతరాజులంతా అతనికి తలొగ్గితే రాజా సుహెల్ దేవ్ ఒక్కడే ఎదరునిలిచి వీరోచితంగా పోరాడి అతన్ని అతని సైన్యాన్ని మట్టికరిపించాడు. అయితే ఘాజీ సయ్యద్ సలార్ మక్సూద్ దగ్గర కమాండర్ గా పని చేసిన సయ్యద్ ఇబ్రహీం చేతిలో ప్రాణాలు కోల్పోయాడు.
ఈ క్రమంలో రాజా సుహెల్ దేవ్ ఎదుర్కొన్న సవాళ్లు ఊహకందని మలుపులు రాజేంద్ర చోళుడు ఈ రాజుకు ఎందుకు సహయం చేయాలనుకున్నాడు?.. చోళులకు ఇతనికి వున్న సంబంధం ఏంటీ? వంటి ప్రతీదీ రాజా సుహెల్ దేవ్ కథలో ఉత్కంఠభరితమే. అయితే ఎమోషన్స్ ని సరిగ్గా పట్టుకోగల దర్శకుడు అయితేనే ఈ కథని మరింత పవర్ ఫుల్ గా తెరపైకి తీసుకురాగలడు. అలా కుదరకపోతే ఇదే మరో `సామ్రాట్ పృథ్వీరాజ్`గా మారే ప్రమాదం వుంది.
చారిత్రక కథలు పీరియాడికల్ స్టోరీలపై ప్రేక్షకుల్లో ఆసక్తివున్నా దాన్ని వారికి కనువిందయ్యే రీతిలో తెరకెక్కిస్తేనే ఆదరిస్తున్నారు. లేదంటే కోట్లు ఖర్చు పెట్టి తీసినా పెద్దగా పట్టించుకోవడం లేదు. కమర్షియల్ హంగుల్ని జోడించి చెప్పగల దర్శకుడు ఆ పాత్రని పడించగల నటుడు కుదిరి అందుకు తగ్గ బడ్జెట్ ని కేటాయించడానికి భారీ నిర్మాణ సంస్థ ముందుకొస్తే తప్ప ఇలాంటి కథలకు ప్రేక్షకులు పట్టం కట్టరు. మరి చరణ్ ఈ కథకు నిజంగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా?.. దర్శకుడిని బట్టి ఓకే చెబుతాడా? అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.
Recent Random Post: