వార్ 2 vs కూలి: ఆగస్ట్‌లో మాస్ హీరోల బాక్సాఫీస్ ఘర్షణ

Share


ఈ ఏడాది ఆగస్ట్‌లో ఇండియన్ బాక్సాఫీస్‌పై భారీ స్థాయిలో మాస్‌ పోరు జరగబోతోంది. ఇది సాధారణ క్లాష్ కాదు. దేశంలోని ఇద్దరు మాస్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రజనీకాంత్ మధ్య భారీ బాక్సాఫీస్ యుద్ధం కానుంది. ఆగస్ట్ 14న ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్ 2, అలాగే రజనీ హీరోగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన కూలి సినిమాలు ఒకేసారి విడుదలకు సిద్ధమవుతున్నాయి.

వార్ 2 షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. చివరి షెడ్యూల్‌లో తారక్, హృతిక్ కలిసి పాల్గొనే పాట ఒకటి మిగిలి ఉంది. మరోవైపు కూలి సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం డబ్బింగ్, ఎడిటింగ్ పనుల్లో బిజీగా ఉంది. వీఎఫ్ఎక్స్ ఎక్కువగా అవసరం లేకపోవడంతో ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ త్వరగా పూర్తయ్యే అవకాశముంది.

ఈ రెండు సినిమాలు ఒకేసారి విడుదల కావడం వలన బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ తప్పదనిపిస్తోంది. ఈ పోరు ఓపెనింగ్స్ పరంగా కాకుండా, రాబోయే రోజుల్లో స్టార్ హీరోల మార్కెట్‌ను నిర్ణయించేలా ఉండే అవకాశముంది. మరోవైపు వచ్చే ఏడాది ఏప్రిల్‌లో కూడా రజనీ, తారక్ మళ్లీ తలపడే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా 2026 ఏప్రిల్ 9న విడుదలయ్యే అవకాశముందని తెలుస్తోంది. అదే సమయానికి జైలర్ 2 కూడా విడుదలయ్యే అవకాశముందని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఇదే కాకుండా, జైలర్ 2 దర్శకత్వం వహిస్తున్న నెల్సన్ దిలీప్ కుమార్ తరువాత ప్రాజెక్ట్ ఎన్టీఆర్‌తోనే ఉండబోతున్నారని టాక్. ఈ పరిణామాలు రజనీ – తారక్ మధ్య ఫ్యూచర్ క్లాష్‌లపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ ఆగస్ట్‌లో జరగబోయే వార్ 2 vs కూలి పోరు పరిశ్రమ మొత్తం ఆసక్తిగా గమనించబోతున్నది. ఇది కేవలం క్లాష్‌ మాత్రమే కాకుండా, భవిష్యత్‌లో జరగబోయే భారీ సినిమాల పోటీలకు దిశను చూపించే సూచికగా మారనుంది.


Recent Random Post: