
‘ధురంధర్’… ఈ పేరు ఇప్పుడు భారత్‌కే కాదు, ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. శత్రుదేశం పాకిస్థాన్‌లో సైతం ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. బాలీవుడ్ చరిత్రలోనే కాకుండా, మొత్తం ఇండియన్ సినిమా దిశనే మార్చే స్థాయిలో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. వెయ్యి కోట్ల మార్క్ దిశగా దూసుకెళ్తున్న ఈ సినిమాను రణ్వీర్ సింగ్ హీరోగా, ‘యూరి’ ఫేమ్ ఆదిత్య ధర్ అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించారు.
అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ వంటి శక్తివంతమైన నటులు కీలక పాత్రల్లో కనిపించడంతో ఈ సినిమా ఇప్పుడు ‘టాప్ ఆఫ్ ద వరల్డ్’గా నిలిచింది. వాస్తవిక సంఘటనలను ఎలాంటి మేకప్ లేకుండా, అదే స్థాయిలో తెరపై ఆవిష్కరించిన తీరు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఓ ఇండియన్ స్పై సాధారణ వ్యక్తిగా అండర్‌కవర్ ఆపరేషన్ కోసం పాక్‌లోకి అడుగుపెట్టి **‘ధురంధర్ ఆపరేషన్’**ను ఎలా మొదలుపెట్టాడు? చివరకు ఎలా ముగించాడు? అన్న ఆసక్తికర కథనంతో ఈ చిత్రం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఎలాంటి భారీ అంచనాలు లేకుండా సాదాసీదాగా విడుదలైన ఈ సినిమా, బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ ట్రేడ్ వర్గాలను షాక్‌కు గురి చేస్తోంది. డిసెంబర్ 5న విడుదలైన ‘ధురంధర్’ ఇప్పటివరకు రూ.900 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. అంతేకాదు, ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ విషయంలో ఇండియన్ సినిమాల్లోనే అత్యధిక డీల్ దక్కించుకున్న చిత్రంగా నిలిచి, ‘పుష్ప 2’ రికార్డును కూడా అధిగమించింది. వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న రణ్వీర్ సింగ్‌కు ఈ సినిమా తిరుగులేని కమ్‌బ్యాక్ ఇచ్చి, అతడికి సరికొత్త స్టార్‌డమ్‌ను అందించింది.
ఇక కెరీర్ ముగిసినట్టేనని విమర్శలు ఎదుర్కొన్న సమయంలో, ‘పిక్చర్ అభీ బాకీ హై’ అన్నట్లుగా అక్షయ్ ఖన్నా ఈ సినిమాతో టాక్ ఆఫ్ ద ఇండియాగా మారాడు. బలోచ్ లీడర్‌ను కలిసే సన్నివేశంలో అక్షయ్ ఖన్నా ఇచ్చిన ఎంట్రీ, వేసిన చిన్న స్టెప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అతడిని ట్రెండ్ అయ్యేలా చేసింది. ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ రెహమాన్ బలోచ్ పాత్రలో భీకరంగా కనిపించాడు.
అంతేకాదు, సినిమాలో చూపించిన యాక్షన్ సన్నివేశాలు అత్యంత రియలిస్టిక్‌గా, ఒళ్లు గగుర్పొడిచే స్థాయిలో ఉండటంతో కొంతమంది ‘టూ మచ్ వయోలెన్స్’ అంటూ విమర్శలు చేస్తుంటే, మరికొందరు మాత్రం నిజంగా జరిగినదే చూపించారంటూ ప్రశంసిస్తున్నారు. ఫస్ట్ పార్ట్‌లో కీలక పాత్రల్ని పరిచయం చేసి, ఎండ్‌లో రెహమాన్ బలోచ్ క్యారెక్టర్‌ను ముగించిన ఆదిత్య ధర్, పార్ట్ 2: రివెంజ్లో మాత్రం రణ్వీర్ సింగ్ విశ్వరూపాన్ని చూపించడంతో పాటు హింసను పతాక స్థాయిలో చూపించబోతున్నాడన్న టాక్ వినిపిస్తోంది.
ఈ విషయాన్ని రెహమాన్ క్యారెక్టర్‌కు రైట్‌హ్యాండ్‌గా ‘డొంగా’ పాత్రలో నటించిన నవీన్ కౌశిక్ తాజాగా వెల్లడించాడు.
“పార్ట్ 1లో చూసిన యాక్షన్, మిస్టరీ, మానిప్యులేషన్ పార్ట్ 2లో 50 రెట్లు ఎక్కువగా ఉంటాయి. ఆ సన్నివేశాలను నేను చూసాను… అందరినీ షాక్‌కు గురి చేస్తాయి. షూటింగ్ పూర్తయ్యింది, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. పార్ట్ 2లో నేను ఉండను కానీ ఏం జరగబోతోందో ఇప్పుడే చెప్పలేను” అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
దీంతో పార్ట్ 1ను ‘ఓవర్‌డోస్ వయోలెన్స్’ అంటూ విమర్శించిన వారు, పార్ట్ 2 చూసిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సిందేనని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
Recent Random Post:














