శర్వానంద్‌కు సక్సెస్ ట్రాక్… కొత్త సినిమాలతో రెట్టింపు ఆశలు

Share


యంగ్ హీరో శర్వానంద్‌కు సరైన సక్సెస్ వచ్చి చాలా కాలమే అవుతోంది. ‘మహానుభావుడు’ తర్వాత ఆయన నటించిన సినిమాలన్నీ ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో విజయం అందని ద్రాక్షలా మారింది. జానర్లు మార్చినా, దర్శకులను మార్చినా కెరీర్‌లో మార్పు కనిపించినా అది బాక్సాఫీస్ ఫలితాలుగా మాత్రం మారలేదు. ఈ మధ్య వివాహం చేసుకుని జీవితంలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినా, ఆ సెంటిమెంట్ కూడా కలిసి రాలేదు. అయితే తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత ‘నారీ నారీ నడుమ మురారీ’తో శర్వానంద్‌కు ఎట్టకేలకు డీసెంట్ హిట్ దక్కింది.

సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమాకు మంచి రివ్యూలు రావడంతో పాటు పబ్లిక్ టాక్ కూడా పాజిటివ్‌గా ఉంది. పెద్దగా నెగటివిటీ లేకపోవడం సినిమాకు కలిసొచ్చింది. పోటీగా ఇతర సినిమాలు ఉన్నప్పటికీ శర్వానంద్ సినిమా చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు వెళ్తున్నారు. థియేటర్లు మరింత పెరిగితే వసూళ్లు ఇంకా మెరుగ్గా వచ్చే అవకాశం ఉన్నా, మిగతా సినిమాలూ బాగానే ఆడటంతో స్క్రీన్లు దొరకడం కాస్త కష్టంగా మారింది. అయినా షోలు సరిగ్గా అడ్జస్ట్ చేస్తే బాక్సాఫీస్ వద్ద నంబర్లు మరింత బలపడే ఛాన్స్ ఉంది. చాలా కాలం తర్వాత వచ్చిన ఈ విజయాన్ని శర్వానంద్ కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాడు.

కానీ ఈ విజయంతో రిలాక్స్ అయ్యే అవకాశం లేదని శర్వానంద్‌కు బాగా తెలుసు. మార్కెట్‌లో పోటీ తీవ్రంగా ఉండటంతో, సక్సెస్‌ను కొనసాగించడమే ఇప్పుడు అసలైన ఛాలెంజ్. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. అందులో ‘బైకర్’పై ఆయన చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. కెరీర్‌లోనే ఒక ప్రత్యేకమైన చిత్రంగా ఇది నిలుస్తుందని, దేశవ్యాప్తంగా ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా ఉంటుందని శర్వానంద్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. అభిలాష్ కంకర దర్శకత్వంలో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా మోటోక్రాస్ రేసింగ్ నేపథ్యంలో రూపొందుతోంది. ఇందులో శర్వానంద్ బైక్ రేసర్‌గా కనిపించనున్నాడు. మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇదే కాకుండా సంపత్ నంది దర్శకత్వంలో ‘భోగి’ అనే మాస్ ఎంటర్‌టైనర్‌లోనూ శర్వానంద్ నటిస్తున్నాడు. సంపత్ నంది మార్క్ ఊర మాస్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా తెరకెక్కుతుండగా, ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అలాగే సంపత్ నంది దర్శకత్వంలో మరో సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలన్నది ప్లాన్.

ప్రస్తుతం ఈ మూడు ప్రాజెక్టులపైనే శర్వానంద్ పూర్తిగా ఫోకస్ పెట్టాడు. ఇవి కనుక సక్సెస్ సాధిస్తే, శర్వానంద్ ఇమేజ్ రెట్టింపు అవడం ఖాయం. అప్పుడు కొంతకాలం పాటు వెనక్కి తిరిగి చూసే అవసరం లేకుండా కెరీర్ మళ్లీ ట్రాక్‌లో పడే అవకాశం కనిపిస్తోంది.


Recent Random Post: