
జీవితం అనేది ఒక్కోసారి గేమ్ ఛేంజర్ లా మారిపోతుంది అంటూ బాలీవుడ్ ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ శామ్ కౌశల్ తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. విక్కీ కౌశల్ తండ్రిగా కూడా అందరికీ తెలిసిన శామ్, ఇటీవల తన జీవితం లో ఓ కీలక మలుపు గురించి వెల్లడించారు.
2003లో శ్యామ్ బెనెగల్ దర్శకత్వంలో ‘నేతాజీ సుభాష్ చంద్రబోస్’ సినిమా షూటింగ్ సమయంలో కడుపులో తీవ్రమైన నొప్పి వచ్చిందని చెప్పారు. మొదట దాన్ని పెద్దగా పట్టించుకోకపోయినా, తర్వాత నొప్పి ఎక్కువవడంతో హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లారట. పరీక్షలు చేసిన వైద్యులు కడుపులో ట్యూమర్ ఉందని, వెంటనే ఆపరేషన్ అవసరం అని చెప్పారు. శస్త్రచికిత్సలో భాగంగా కడుపులోని భాగాన్ని తొలగించారు.
ఆ ఆపరేషన్ తర్వాత శామ్ కౌశల్ మూడు రోజుల తర్వాత కళ్లు తెరిచారు కానీ తీవ్ర నొప్పి, బలహీనత కారణంగా ఆయన తీవ్రమైన మానసిక స్థితిలోకి వెళ్లిపోయారు. “నాకు ఆ సమయంలో చనిపోవాలనిపించింది. ఆసుపత్రి భవంతిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నాను” అని ఆయన ఆ త్రాసిం ఘట్టాన్ని గుర్తుచేసుకున్నారు.
“అయితే నా పిల్లలు చిన్నవాళ్లు. వారిని విడిచిపెట్టి వెళ్లిపోవడం అన్యాయం అనిపించి.. కనీసం పది ఏళ్లు అయినా బ్రతకాలని దేవుడిని ప్రార్థించాను” అన్నారు. ఇప్పుడు 22 ఏళ్లు గడిచినా, ఆరోగ్యంగా, హాయిగా ఉన్నానని, తన పిల్లలు సెట్ అయి సంతోషంగా ఉన్నారని చెప్పారు.
శామ్ కౌశల్ ‘లక్ష్య’, ‘భాగ్ మిల్కా భాగ్’, ‘పికే’, ‘సంజు’, ‘కృష్ణ’, ‘పద్మావత్’, ‘గ్యాంగ్స్ ఆఫ్ వాసీపూర్’, ‘టైగర్ జిందా హై’, ‘సింబా’ లాంటి పలు సినిమాలకు యాక్షన్ డైరెక్టర్ గా పనిచేసారు. తన జీవితంలో ఆ కష్టమైన దశను దాటుకుని ఈ స్థితికి రావడం తాను ఓ విజయంగా భావిస్తున్నానని చెప్పారు.
Recent Random Post:















