
శివాజీ వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి సంబంధించి సింగర్ చిన్మయి శ్రీపాద మరోసారి తనదైన స్టైల్లో గట్టిగా స్పందించారు. “వస్త్రధారణే నేరాలకు కారణం” అనే వాదనను పూర్తిగా కొట్టిపారేస్తూ, తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా పదునైన ప్రశ్నలు సంధించారు. కొన్నాళ్ల క్రితం విరాట్ కోహ్లీ–అనుష్క శర్మల 8 నెలల చిన్నారి పాపకు ఒక ఐఐటీ చదివిన యువకుడు రేప్ బెదిరింపులు పంపిన ఘటనను గుర్తు చేస్తూ, “ఆ చంటి బిడ్డ ఏం డ్రెస్ వేసుకుందని ఆ మాట అన్నాడు?” అని సూటిగా ప్రశ్నించారు. ఆ యువకుడి భవిష్యత్తు దృష్ట్యా ఆ దంపతులు కేసును వదిలేశారని కూడా ఆమె గుర్తు చేశారు.
పితృస్వామ్య సమాజంలో కొంతమంది మగవాళ్లు పూర్తిగా బ్రెయిన్‌వాష్‌కు గురయ్యారని చిన్మయి వ్యాఖ్యానించారు. మహిళలు చదువుకుని, ఉద్యోగాలు చేస్తూ ఆర్థికంగా స్వతంత్రులవుతుంటే, తమ ప్రాముఖ్యత తగ్గిపోతుందేమో అన్న భయంతోనే ఇలాంటి ద్వేషాన్ని వెళ్లగక్కుతున్నారని చెప్పారు. ఇలాంటి మనస్తత్వం ఉన్నవారిని ‘ఇన్సెల్స్’ అని పిలుస్తారని ఆమె వివరించారు.
ఈ సందర్భంగా అమ్మాయిలకు చిన్మయి కొన్ని కీలక సూచనలు కూడా చేశారు. ఎవరి మీద ఆధారపడకుండా చదువుకుని, ఆర్థికంగా నిలదొక్కుకోవాలని చెప్పారు. పెళ్లి విషయంలో తొందరపడాల్సిన అవసరం లేదని, బయోలాజికల్ క్లాక్ అనే భయంతో జీవిత నిర్ణయాలు తీసుకోవద్దని ధైర్యం చెప్పారు. వీలైతే విదేశాలకు వెళ్లి ప్రపంచాన్ని చూడాలని, మన కోసం మనమే బతకాలని, సేవింగ్స్కి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
పెళ్లికి ముందు అబ్బాయి ఆస్తిపాస్తులు లేదా చదువుకన్నా, అతను సోషల్ మీడియాలో ఎలా ప్రవర్తిస్తున్నాడో గమనించాలన్నారు. హీరోయిన్లను బూతులు తిట్టేవాడా, డ్రైవర్లు, వాచ్మెన్లను తక్కువగా చూస్తాడా అన్నది చూడాలని చెప్పారు. “ల**” వంటి పదాలు వాడేవాళ్లు, మహిళల డ్రెస్సింగ్‌పై నీతులు చెప్పే మగవాళ్లు ఉన్న కుటుంబాల్లో అస్సలు పెళ్లి చేసుకోవద్దని ఆమె హెచ్చరించారు. గత రెండు రోజులుగా ఆడవాళ్లు ఎలా ఉండాలో క్లాసులు పీకుతున్నారని, “బట్టలు విప్పుకుని తిరగండి” వంటి అసహ్యకరమైన కామెంట్స్ వస్తున్నాయంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే సమస్య కేవలం లింగంతో సంబంధం లేదని, మైండ్‌సెట్‌నే అసలు సమస్య అని చిన్మయి స్పష్టం చేశారు. తనతో చాలామంది మగవాళ్లు కూడా తాము లైంగిక వేధింపులకు గురయ్యామని చెప్పుకున్న సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నారు. చివరగా, హింసాత్మక సంబంధాల్లో ఉండాల్సిన అవసరం లేదని, “గొంతులో కాలు పెట్టి తొక్కాలి” అన్నట్లుగా ప్రవర్తించే వ్యక్తుల నుంచి దూరంగా ఉండటమే మంచిదని తేల్చి చెప్పారు.
మొత్తంగా శివాజీ ఎపిసోడ్ తర్వాత చిన్మయి చేసిన ఈ వ్యాఖ్యలు, అమ్మాయిలకు ఆర్థిక స్వేచ్ఛ, స్వాభిమానమే అసలైన బలం అనే గట్టి సందేశాన్ని ఇచ్చినట్లయ్యాయి.
Recent Random Post:














