శ్రీకాంత్ విస్సాతో కళ్యాణ్ రామ్ కొత్త ప్రయోగం

Share


కెరీర్ ఆరంభం నుంచే కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ వస్తున్న హీరో నందమూరి కళ్యాణ్ రామ్ తన ప్రయాణంలో హిట్లు, ఫ్లాపులు రెండింటినీ సమానంగా ఎదుర్కొన్నారు. ‘అతనొక్కడే’, ‘హరే రామ్’, ‘పటాస్’ వంటి సినిమాలతో ప్రతిభావంతులైన దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ముఖ్యంగా ఆయన పరిచయం చేసిన అనిల్ రావిపూడి ఇప్పుడు వరుస బ్లాక్‌బస్టర్లతో స్టార్ డైరెక్టర్‌గా నిలిచారు.

అయితే ప్రతి ప్రయోగం సక్సెస్ కాలేదు. కొంతమంది కొత్త దర్శకులతో చేసిన సినిమాలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడంతో కళ్యాణ్ రామ్‌కు నిరాశలు ఎదురయ్యాయి. ‘బింబిసార’తో వశిష్టను దర్శకుడిగా పరిచయం చేసి సూపర్ హిట్ అందుకున్న ఆయన, మళ్లీ ట్రాక్‌లోకి వచ్చినట్టే అనిపించింది. కానీ ఆ తర్వాత వచ్చిన ‘అమిగోస్’, ‘ది డెవిల్’, ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ వంటి చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయాయి.

దాదాపు ఏడాది గ్యాప్ తీసుకున్న కళ్యాణ్ రామ్ ఇప్పుడు మళ్లీ కొత్త ఉత్సాహంతో రాబోతున్నారు. ఈసారి కూడా మరో కొత్త దర్శకుడిని పరిచయం చేయబోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ‘పుష్ప’, ‘పుష్ప 2’ వంటి పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్లకు డైలాగ్స్ అందించిన రచయిత శ్రీకాంత్ విస్సాను దర్శకుడిగా పరిచయం చేయనున్నారని సమాచారం. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి.

ఈ సినిమాను ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ నిర్మాత ముప్పా అశోక్ వర్ధన్ నిర్మించనున్నారని తెలుస్తోంది. శ్రీకాంత్ విస్సా చెప్పిన కథ కళ్యాణ్ రామ్‌ను బాగా ఆకట్టుకుందని టాక్. గత ఏడాది చివర్లోనే ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పినప్పటికీ, షూటింగ్‌ను 2026లో ప్రారంభించాలని నిర్ణయించుకున్నారట. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.

హిట్ సినిమాలకు మాటలు అందించిన రచయితగా పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ విస్సా, దర్శకుడిగా కూడా అదే స్థాయి మేజిక్ చూపించి కళ్యాణ్ రామ్‌కు మరో సక్సెస్ అందిస్తాడా? అన్నది చూడాలి. అభిమానులు మాత్రం ఈ కాంబినేషన్‌పై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Recent Random Post: