షారుక్ తమిళ్ ట్రీట్.. జవాన్ పరిస్థితేంటీ?

సినిమా ఇండస్ట్రీలో ఎన్నో మార్పులు వచ్చాయి. ముఖ్యంగా కరోనా తర్వాత దేశవ్యాప్తంగా ప్రేక్షకుల అభిరుచి మారింది. కంటెంట్ బాగుంటే ఏ భాష సినిమానైనా ఆదరిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని కాస్త పక్కన పెడితే.. ఎంత కాదనుకున్నా పరాయి భాష ఇండస్ట్రీ కన్నా సొంత భాష చిత్రసీమ పై మమకారం కాస్త ఎక్కువే ఉంటుంది ఆడియన్స్ కి. అయితే ఈ విషయంలో తమిళ ప్రేక్షకులకు ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. మన భాష మన సినిమా మన హీరో మన ఇండస్ట్రీయే గొప్ప అన్న భావన అక్కడి వాళ్ళలో ఎక్కువుగా కనిపిస్తుంటుంది.

నిజానికి ఇలా ఉండటానికి ఓ కారణం ఉంది. ఒకప్పుడు దేశం మొత్తానికి సినిమాల విషయంలో ఆదర్శంగా నిలిచేది తమిళ చిత్ర సీమ. అక్కడి సినిమాల నాణ్యత వైవిధ్యం భారీతనం రీచ్ అంతా కూడా వేరే స్థాయిలో ఉండేది. కానీ గత దశాబ్ద కాలంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అయినా అక్కడి వాళ్ళు మాత్రం పక్క భాష సినిమా గొప్పతనాన్ని ప్రశంసించడానికి ఎక్కువ ఇష్టపడరు. చూడటానికి కూడా తక్కువ ఆసక్తి చూపుతారు.

సినిమా భారీ స్థాయిలో హిట్ అయితేనే చూసేందుకు ఇష్టపడతారు. అపుడు కూడా అందులో ఏదో ఒక వంక పెడతారు. బాహుబలి సిరీస్ ఆర్ఆర్ఆర్ వంటి పాన్ ఇండియా సినిమాలే వారిని కాస్త ఆకట్టుకున్నాయి. అప్పటికి వారు ఆర్ఆర్ఆర్ విషయంలో కొన్ని వంకలు పెట్టారు.

కానీ ఇప్పుడు మాత్రం వారిని ఓ పాన్ ఇండియా సినిమా బాగా ఆకర్షిస్తోంది. అదే బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న జవాన్. ఎందుకంటే దీన్ని తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్నారు. సెప్టెంబర్ 7న రిలీజ్ కానున్న ఈ చిత్రం పై తమిళ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది.

ఇంకా చెప్పాలంటే.. షారుఖ్ ఖాన్ కూడా తమిళ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించారని చెప్పాలి. ఆయన రీసెంట్ పఠాన్ సినిమా ఇండియా వైడ్ గా పెద్ద హిట్ ను అందుకుంది. తమిళంలో కూడా బాగానే అడింది. కానీ అది హిందీ వెర్షన్ లో మాత్రమే. అందుకే ఈ సారి షారుఖ్.. జావాన్ తమిళంలో ఎక్కువ రీచ్ అయ్యేందుకు ఎక్కువ ఫోకస్ పెట్టారు. అందుకోసం.. ఎక్కువుగా తమిళ యాక్టర్స్ టెక్నీషియన్స్ ను తీసుకున్నారు.

హీరోయిన్ గా నయనతార ప్రతినాయకుడిగా విజయ్సేతుపతి నటిస్తున్నారు. అతిధి పాత్రలో విజయ్ తలపతి కనిపించనున్నారు. కామెడీ రోల్ లో యోగి బాబు నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. వీరందరూ తమిలులే కావడం విశేషం. అందుకే ఈ పాన్ ఇండియా సినిమా పై తమిళ ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. చూడాలి మరి షారుఖ్ వ్యూహం ఎంత వరకు పనిచేస్తుందో…


Recent Random Post: