ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరియు మెగాస్టార్ చిరంజీవి ఒకే వేదికపై కనిపించడం ఇటీవలి కాలంలో అరుదైన సంఘటనగా మారింది. గతంలో ఒకసారి మాత్రమే, ప్రమాణస్వీకార మహోత్సవంలో ఇద్దరూ కలిసి పాల్గొన్నారు.
అయితే, తాజాగా చిరంజీవి, మోదీలు సంయుక్తంగా పాల్గొన్న కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో అధికార భాగస్వామ్య పార్టీ జనసేనతో మోదీకి ఉన్న అనుబంధం తెలిసిందే. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ప్రధాని మోదీ గతంలో ప్రశంసించడం కూడా ఇదివరకే వార్తల్లో నిలిచింది.
తాజాగా, సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని తెలంగాణ బీజేపీ నేత, కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి తన ఢిల్లీలోని నివాసంలో ప్రత్యేక వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, టెన్నిస్ స్టార్ పీవీ సింధు, నటుడు తేజ సజ్జా, గాయనిగ సునీతతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. చిరంజీవిని ప్రధాన మంత్రి మోదీ ప్రత్యేకంగా గౌరవించడం గమనార్హం. మోదీ చిరంజీవిని చూశాక ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని, జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో చిరంజీవికి ప్రాముఖ్యతనిచ్చారు. మోదీ మొదటి దీపాన్ని వెలిగించగా, రెండో దీపాన్ని చిరంజీవి వెలిగించారు.
అంతేకాదు, కార్యక్రమం ముగిసే వరకు మోదీ, చిరంజీవి పక్కపక్కన కూర్చొని వేడుకను ఆస్వాదించారు. ఈ సంఘటనతో మోదీ, పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న సంబంధం లాగే చిరంజీవితో కూడా మోదీ సాన్నిహిత్యాన్ని పెంచుకుంటున్నారనే చర్చ జోరుగా సాగుతోంది.
Recent Random Post: