సీత పాత్రలో సాయి పల్లవి ఎంపికపై విభిన్న అభిప్రాయాలు!

Share


సాయి పల్లవి టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఎలాంటి పాత్రలో నటించినా, ఆ పాత్రకు ప్రాణం పోస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. “గ్లామర్ కన్నా నటన ముఖ్యమని” తన కెరీర్ మొత్తం సాయి పల్లవి నిరూపిస్తూనే వచ్చారు. ఇప్పటి వరకు ఆమె చేసిన పాత్రలలో చాలా చాలా గుండెల్లో నిలిచిపోయేలా ఉన్నాయి.

ప్రస్తుతం ఆమె నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న భారీ బాలీవుడ్ ప్రాజెక్ట్ రామాయణలో సీత పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సాయి పల్లవిని ఈ పాత్రకు ఎంపిక చేసినప్పటి నుంచి ఆమె పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఆమె ఎంపికపై అభిమానులు, నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఒక్కవైపు కొంతమంది సాయి పల్లవిని మద్దతు ఇస్తుంటే, మరోవైపు కొందరు మాత్రం ఆమె అందం సీత పాత్రకు సరిపోదని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వాల్మీకి రాసిన రామాయణంలో సీతను “చంద్రకాంతి”తో పోల్చినట్లు పేర్కొంటూ, అలాంటి అపురూప సౌందర్యం ఉన్న సీతకు సాయి పల్లవి సరిపోవడం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. వీరే ఇప్పుడు కాజల్ అగర్వాల్‌ను మండోదరి పాత్రకు తీసుకున్నారని తెలిసిన వెంటనే మరింతగా విమర్శలు పెంచుతున్నారు. “సీతగా సాయి పల్లవి కంటే మండోదరి పాత్రలో కాజల్ మిన్నగా కనిపిస్తుందేమో!” అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు.

అయితే ట్రోల్స్ వొకవైపు ఉండగా, మరోవైపు ఆమెకు గట్టి మద్దతు కూడా కనిపిస్తోంది. సాయి పల్లవి ఒక నటిగా తన అద్భుత అభినయంతో ఎన్నో పాత్రలను విజయవంతంగా పోషించిందని, సీత పాత్రలో కూడా భావోద్వేగాలతో అలరించే నటనను చూపుతారని ఆమె అభిమానులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అందం కన్నా నటన ప్రధానమని, పాత్రలో జీవించగల నటి కావాలంటే సాయి పల్లవి కరెక్ట్ ఎంపిక అని అభిప్రాయపడుతున్నారు.

ఇంత అనుభవం ఉన్న డైరెక్టర్ నితేష్ తివారీ ఇలా పొరపాటుగా ఎవరి అభిప్రాయం లేకుండానే ఎంపిక చేస్తాడా? అని వారు విమర్శకులను ప్రశ్నిస్తున్నారు. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతోంది. మొదటి భాగం ఈ దీపావళికి, రెండో భాగం వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానుంది.

సాయి పల్లవిపై విమర్శలు ఉండొచ్చు. కానీ ఆమె నటనతో ఈసారి కూడా ప్రేక్షకులను మెప్పించగలదని, సీత పాత్రలో ఒక గొప్ప గుర్తింపును సంపాదించనుందని ఆమె అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు.


Recent Random Post: