సామాన్యులు మాన్యులు అనే తేడా లేకుండా అందరి స్మార్ట్ ఫోన్లలోను అందుబాటులో ఉంది – ఓటీటీ. సినిమా చూడాలంటే థియేటర్ కే వెళ్లాలనే రొటీన్ మనస్తత్వం నెమ్మదిగా మాసిపోతోంది. పాతదనానికి బాయ్ బాయ్ చెప్పేసి కొత్త ట్రెండుకి నేటి యువతరం అలవాటు పడిపోయింది. ఇంటిల్లిపాదికీ సరైన వినోద సాధనం ఏదీ? అంటే ఓటీటీ అని ఠకీమని చెబుతున్నారు. భవిష్యత్ అంతా ఓటీటీదేనని సినీ ప్రముఖులు సైతం విశ్లేషిస్తున్నారు. పెద్ద తెర పూర్తిగా మూత పడకపోయినా ఓటీటీల ప్రభావం ఆడియెన్ పై గణనీయంగా ఉందని సర్వేలు చెబుతున్నాయి.
సరిగ్గా ఇలాంటి సమయంలో భారీ కళాత్మక చిత్రాల దర్శకనిర్మాత సంజయ్ లీలా భన్సాలీ తన ఫార్ములాను ఓటీటీ రంగంలోను అప్లయ్ చేస్తూ సంచలనంగా మారారు. భారీ ఓటీటీ సిరీస్ ని ఆయన రూపొందించడం హాట్ టాపిక్ గా మారింది. అతడు ఎంపిక చేసుకున్న బ్యాక్ డ్రాప్ అంతే ఎగ్జయిట్ చేస్తోంది. భన్సాలీ తెరకెక్కిస్తున్న తాజా ఓటీటీ సిరీస్ ` హీరామండి` భారతీయ ఓటీటీ రంగంలోనే ఒక సంచలనంగా మారనుందని అంచనా వేస్తున్నారు. OTTని తదుపరి స్థాయికి తీసుకెళ్తూ ట్యాలెంటెడ్ ఫిలింమేకర్ సంజయ్ లీలా భన్సాలీ (SLB) ఇప్పుడు వేశ్యావాటికల్లో వేశ్యల జీవితాలపై వెబ్ సిరీస్ ని రూపొందిస్తున్నారు. స్వాతంత్రానికి పూర్వం భారతదేశంలోని వేశ్యల జీవితాల్లో ప్రేమ విద్రోహం తాలూకా కథలను తెరపైకి తెస్తున్నారు. `హీరామండి` అనే ఒక కొత్త ప్రపంచంలోకి వీక్షకులను తీసుకెళ్లబోతున్నారు. ఇక్కడ `వేశ్యలు రాణులు`గా ఏల్తారు.
సెట్టింగు లేదా కథతో సంబంధం లేకుండా విలక్షణమైన రూపాలు.. చక్కటి డీటెయిలింగ్ తో ప్రతి ఫ్రేమ్ వర్ణరంజితంగా అలరించనుంది. నాటి కాలమానానికి తగ్గట్టుగా భారతీయ వస్త్రాలు- కళాకృతులు- రంగుల మిశ్రమం.. మేకప్ సంవిధానం ప్రతిదీ ప్రత్యేకతతో కూడుకున్నవే. హీరామండి వేశ్యల జీవితాల్లో ప్రతి అంశాన్ని దర్శకుడు వ్యక్తిగతంగా సూక్ష్మ వివరాలను పరిశీలించి వాటిని తెరపైకి తెస్తున్నారు. నటీనటుల రూపురేఖలు సెట్ లోని డిజైనర్ లుక్ సహా ప్రతి సన్నివేశంలోని ఆర్ట్ డిజైన్.. లైటింగ్ వరకు విభిన్నమైన దృశ్యమాన అనుభవాన్ని ప్రజలకు అందించాలని తపిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… `హీరా మండి` గ్లోబల్ ఎరేనాలో అతిపెద్ద భారతీయ OTT సిరీస్ కావడంతో ఈ సిరీస్ కోసం పెట్టుబడుదారులు వాటాదారులు ఎక్కువగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది. దీనివల్ల భన్సాలీ మరింత ప్రతిష్టాత్మకంగా భావించి దీనిని తెరకెక్కిస్తున్నారు.
భన్సాలీ మునుపటి చిత్రాలైన హమ్ దిల్ దే చుకే సనమ్- దేవదాస్- పద్మావత్ – గంగూబాయి కతియావాడి ఇలా ప్రతిసినిమా భారీ సెట్ డిజైన్లతో అలరించాయి. వీటన్నిటినీ మించేలా హీరామండి కోసం భారీ సెట్ ని డిజైన్ చేయించారు. దాదాపు 160000 చదరపు అడుగుల విస్తీర్ణంలో సెట్ ని నిర్మించారని తెలిసింది. ఇది ఇప్పటివరకూ సెట్ విస్తీర్ణం పరంగా అరుదైన రికార్డ్ అని చెబుతున్నారు. ఆయన తన సినిమా సెట్ లలో సమయానుకూలంగా సంస్కృతిని ఇన్ బిల్ట్ చేసే తీరు వేరు. సూక్ష్మమైన ప్రతి అంశాన్ని ఆవిష్కరిస్తూ ప్రేక్షకులను పూర్తిగా భిన్నమైన ప్రపంచంలోకి తీసుకెళ్లడం అతడికే చెల్లిన విద్య. అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ `హీరా మండి` కోసం అతడు చాలా శ్రమిస్తున్నారు. భన్సాలీ తన ఐకానిక్ చిత్రాల కంటే రెట్టింపు అభిరుచిని ఉన్నత స్థాయిని హీరామండి సిరీస్ కోసం తెచ్చాడని టాక్ వినిపిస్తోంది. మనీషా కొయిరాలా- సోనాక్షి సిన్హా- అదితి రావ్ హైదరీ- రిచా చద్దా- షర్మిన్ సెగల్ – సంజీదా షేక్ వంటి ప్రతిభావంతులైన నటీమణులతో హీరామండి ఒక అద్భుత విజువల్ ప్రపంచంగా కనిపించనుంది. ఇది నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం అవుతుంది.
Recent Random Post: