సోగ్గాళ్లకు సంక్రాంతి సవాళ్లు

Share


అక్కినేని ఫ్యామిలీ నుంచి ముగ్గురు హీరోలు ఒకేసారి స్క్రీన్‌పై కనిపిస్తారంటే అంచనాలు సహజంగానే భారీగా ఉంటాయి. అయితే ‘సోగ్గాళ్లు’ సినిమాకు 2027 సంక్రాంతి బరిలో గెలుపు అంత ఈజీగా ఉండేలా కనిపించడం లేదు. ఒకవైపు బాక్సాఫీస్ దగ్గర సీనియర్ హీరోల పోటీ, మరోవైపు పూర్తిగా మారిపోయిన ప్రేక్షకుల అభిరుచి మధ్య పాత ఫార్ములాను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం దర్శకుడు కళ్యాణ్ కృష్ణకు పెద్ద పరీక్షగా మారింది. ఈసారి సోగ్గాళ్ల ప్రయాణం అడుగడుగునా సవాళ్లతో నిండినట్టే కనిపిస్తోంది.

మొదటి పెద్ద సవాలు బాక్సాఫీస్ వద్ద ఉన్న హెవీ కాంపిటీషన్. చిరంజీవి–బాబీ, బాలకృష్ణ–గోపీచంద్ మలినేని సినిమాలు సంక్రాంతి టార్గెట్ చేస్తున్నాయి. వీటిలో ఏవి ఫైనల్‌గా రిలీజ్ అవుతాయో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి ఉన్నా, వెంకటేష్–అనిల్ రావిపూడి కాంబినేషన్ మాత్రం పక్కా రేస్‌లో ఉండే ఛాన్స్ ఎక్కువ. సీనియర్ హీరోలు మాస్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లతో పండగ బరిలో ఉంటే థియేటర్ల కేటాయింపు నుంచి వసూళ్ల వరకు పోటీ తీవ్రంగానే ఉంటుంది. ముగ్గురు అక్కినేని హీరోలు ఉన్నా కూడా ఈ కాంబినేషన్ల మధ్య నిలబడటం అంత తేలికైన పని కాదు.

ఇక కేవలం ‘అక్కినేని’ బ్రాండ్ మీదే ఆధారపడితే ఈసారి పప్పులు ఉడికే పరిస్థితి లేదు. కంటెంట్ పరంగా మరో పెద్ద రిస్క్ ఎదురవుతోంది. ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘బంగార్రాజు’ సినిమాల్లో ఆత్మలు, ఫాంటసీ ఎలిమెంట్స్ ఇప్పటికే ప్రేక్షకులకు అలవాటైపోయాయి. మూడోసారి కూడా అదే రొటీన్ ఫార్ములాతో ముందుకు వెళితే బోర్ ఫీలింగ్ వచ్చే ప్రమాదం ఉంది. విలేజ్ కామెడీ, మాస్ ఎలివేషన్లు ఓకే కానీ, ముగ్గురు హీరోలకు సరిపడా బలమైన కథను రెడీ చేయడం కత్తిమీద సామే. ఈసారి సత్యానంద్ స్క్రీన్‌ప్లే నిజంగా మ్యాజిక్ చేస్తే తప్ప కొత్తదనం కనిపించడం కష్టం.

మ్యూజిక్ అంశం కూడా పెద్ద ఛాలెంజ్‌గా మారింది. గత రెండు సినిమాల సక్సెస్‌లో అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కీలక పాత్ర పోషించింది. కానీ ప్రస్తుతం ఆయన ఫామ్‌లో లేకపోవడం సినిమాకు మైనస్‌గా మారే అవకాశం ఉంది. ఒకవేళ మ్యూజిక్ డైరెక్టర్ మారినా, ఈ ఫ్రాంచైజీకి ఉన్న సిగ్నేచర్ ట్యూన్స్‌, ఆ వైబ్‌ను కొత్తవారు ఎంతవరకు మ్యాచ్ చేస్తారనేది పెద్ద ప్రశ్నే. పాటలు క్లిక్ కాకపోతే సోగ్గాళ్లకు కావాల్సిన హైప్ రావడం కష్టం.

అన్నిటికంటే ముఖ్యమైన అంశం అఖిల్ పాత్ర హ్యాండ్లింగ్. నాగార్జున, చైతన్యకు ఇప్పటికే ఈ ఫ్రాంచైజీలో బలమైన ఇమేజ్ ఉంది. అఖిల్‌ను ఎలా ఇంట్రడ్యూస్ చేస్తారు? ఆయనకు ఇచ్చే ఎలివేషన్లు సహజంగా ఉంటాయా, లేక అతిగా అనిపిస్తాయా? అన్నదే కీలకం. అక్కినేని వారసులందరినీ సంతృప్తిపరచాలనే ప్రయత్నంలో కమర్షియల్ హంగులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే కథ దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది.

ఇక చివరిగా, దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత కళ్యాణ్ కృష్ణ మళ్లీ మెగాఫోన్ పట్టుతున్నారు. ఈ మధ్యకాలంలో టాలీవుడ్ మేకింగ్ స్టైల్, ఆడియన్స్ టేస్ట్ పూర్తిగా మారిపోయాయి. పాత ఫార్ములాతోనే నెట్టుకురావాలనుకుంటే ఈసారి రిస్క్ మరింత పెరుగుతుంది.


Recent Random Post: