
బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్లో కూడా మంచి గుర్తింపు పొందిన హీరోయిన్ Sonali Bendre తాజాగా ఓ భూ వివాదం కారణంగా వార్తల్లో నిలిచింది. తెలుగులో చిరంజీవి, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో నటించి ప్రేక్షకులకు దగ్గరైన ఆమె పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
వివరాల్లోకి వెళ్తే, పూణేకు చెందిన చంద్రకాంత్ అనే రైతు తన 30 గుంటల వంశపారంపర్య భూమిని సోనాలీ బింద్రే మరియు ఆమె భర్త గోల్డీ బెహల్ ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించాడు. 1957 నుంచీ తమ కుటుంబానికి చెందిన భూమిని తమకు తెలియకుండా తీసుకున్నారని, పైగా ఆ భూమిలోకి తనను అడుగు పెట్టనివ్వకుండా అడ్డుకుంటున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ విషయంపై పలుమార్లు వారిని కలిసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో చివరకు పోలీసుల వద్దకు వెళ్లినట్టు తెలిపాడు.
ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు సమాచారం. రెవెన్యూ అధికారులతో కూడా చర్చించి పూర్తి వివరాలు సేకరించే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా, ఈ ఆరోపణలపై సోనాలీ బింద్రే స్పందిస్తూ తమపై వచ్చిన ఆరోపణలను ఖండించింది. తాము ఆ భూమిని పూర్తిగా చట్టబద్ధంగా కొనుగోలు చేశామని, అన్ని ఆర్థిక లావాదేవీలు సక్రమంగా జరిగాయని తెలిపింది. తమ ప్రతిష్టను దెబ్బతీయడానికి కొందరు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆమె అసహనం వ్యక్తం చేసింది.
ఈ వ్యవహారాన్ని కోర్టులో తేల్చుకుంటామని, తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని, నిజం తమవైపు ఉంటుందని ఆమె స్పష్టం చేసింది. తమపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది.
సెలబ్రిటీల భూముల కొనుగోళ్లలో ఇలాంటి వివాదాలు కొత్తేమీ కావు. కొన్నిసార్లు మధ్యవర్తులపై ఆధారపడటం వల్ల సమస్యలు తలెత్తిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈ కేసులో అసలు నిజం ఏమిటో తెలియాలంటే పూర్తి స్థాయి విచారణ జరగాల్సి ఉంది. కొందరు నెటిజన్లు సోనాలీ వంటి ప్రముఖులు ఇలాంటి వ్యవహారాల్లో నేరుగా పాల్గొనడం కష్టమని భావిస్తుండగా, మరికొందరు మాత్రం సెలబ్రిటీ ప్రభావాన్ని ఉపయోగిస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. ఈ వివాదం చివరకు ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.
Recent Random Post:















