
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాఖలు చేసిన పర్సనాలిటీ రైట్స్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో నేడు కీలక విచారణ జరిగింది. తమ అనుమతి లేకుండా పేరు, ఫోటోలు, వీడియోలు, వాయిస్‌ను వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగిస్తూ, మార్ఫింగ్ చేసి అవమానకర ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ ఇద్దరు స్టార్‌లు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
ఈ కేసును జస్టిస్ మన్మీత్ ప్రీతం సింగ్ అరోరా ధర్మాసనం విచారించింది. పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది జే సాయి దీపక్ వాదనలు వినిపించారు. సోషల్ మీడియా వేదికల్లో మార్ఫింగ్ చేసిన ఫోటోలు, తప్పుడు వీడియోలు, అసభ్య వ్యాఖ్యలతో కూడిన పోస్టులు విస్తృతంగా వైరల్ అవుతున్నాయని, దీని వల్ల సెలబ్రిటీల వ్యక్తిత్వ హక్కులకు తీవ్ర భంగం కలుగుతోందని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ సంస్థలు, ఎక్స్ (ట్విట్టర్), గూగుల్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు అనుమతి లేకుండానే సెలబ్రిటీ ఇమేజ్‌లను వాణిజ్యంగా ఉపయోగిస్తున్నాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈ దిగ్గజ సంస్థలను ప్రతివాదులుగా కేసులో చేర్చారు.
ప్రతివాద సంస్థల తరఫున న్యాయవాదులు స్పందిస్తూ, ఫిర్యాదు అందిన వెంటనే అభ్యంతరకరంగా ఉన్న కొన్ని లింకులను ఇప్పటికే తొలగించినట్లు కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం పలు కీలక సూచనలు చేసింది. ఏదైనా కంటెంట్‌ను శాశ్వతంగా తొలగించే ముందు, ఆ కంటెంట్‌ను పోస్ట్ చేసిన వినియోగదారుడి వాదనలు కూడా వినాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది.
అలాగే ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో అభిమానుల ఖాతాల ద్వారా వచ్చే పోస్టుల విషయంలో అవి అధికారిక ఖాతాలు కాదని స్పష్టంగా తెలియజేసేలా డిస్క్లైమర్ తప్పనిసరిగా ఉండాలని సూచించింది. అభ్యంతరకర కంటెంట్ ఉన్న ఖాతాల వివరాలను గూగుల్ సంబంధిత వినియోగదారులకు తెలియజేయాలని, అవసరమైతే ఆ ఖాతాలను నిలిపివేయాలని ఆదేశించింది. వివాదాస్పద పోస్టులకు సంబంధించిన BSI, IP లాగిన్ వివరాలను మూడు వారాల్లోగా కోర్టుకు సమర్పించాలని కూడా స్పష్టం చేసింది. తదుపరి విచారణను మే 12కి వాయిదా వేసింది.
సెలబ్రిటీల వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ విషయంలో ఢిల్లీ హైకోర్టు ఇవ్వబోయే తుది తీర్పు కీలక మైలురాయిగా మారే అవకాశం ఉందని, భవిష్యత్తులో ఇతర రంగాల ప్రముఖులకు కూడా మార్గదర్శకంగా నిలవొచ్చని న్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Recent Random Post:














