అజిత్ మాస్ రీ ఎంట్రీ, గుడ్ బ్యాడ్ అగ్లీ టీజర్ హైప్

Share


గత కొంతకాలంగా అజిత్ సినిమాలు ప్రేక్షకులను పూర్తిగా మెప్పించలేకపోయాయి. వలిమై మరియు తునివు తమిళనాడులో మంచి వసూళ్లు సాధించినప్పటికీ, ఫ్యాన్స్ వాటిని గర్వంగా చెప్పుకోలేని యావరేజ్ సినిమాలుగా మిగిలిపోయాయి. ఇక విడాముయార్చి (పట్టుదల) విషయానికి వస్తే, అది అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. కేవలం 25 రోజుల్లోనే ఓటీటీ రిలీజ్ కావడం పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో స్పష్టంగా తెలియజేస్తోంది.

ఈ నేపథ్యంలో, అజిత్‌ మళ్లీ ఫుల్ మాస్ పవర్‌తో రీ ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఆ కోరికను తీర్చేందుకు తెలుగు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ముందుకొచ్చింది. వారి నిర్మాణంలో తెరకెక్కిన గుడ్ బ్యాడ్ అగ్లీ టీజర్ ఇవాళ విడుదల అయింది. దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ అజిత్ వీరాభిమాని కావడంతో, తన అభిమానాన్ని తెరపై చూపించేందుకు ఈ సినిమాతో మరింత ప్రయత్నించాడు. టీజర్ చూస్తే అదే స్పష్టమవుతోంది.

ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో అజిత్ మూడు లేదా నాలుగు వేరియేషన్లలో కనిపిస్తున్నాడు. యవకుడిగా మొదలుకుని, స్టైలిష్ వృద్ధుడిగా మారే ప్రయాణాన్ని ఈ సినిమాలో ప్రదర్శించినట్లు టీజర్ ద్వారా అర్థమవుతోంది. అజిత్ పక్కన ప్రముఖ నటుడు సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. యాక్షన్ ఎపిసోడ్స్, మాస్ మసాలా ఎలిమెంట్స్ అన్నీ అభిమానులను టార్గెట్ చేస్తూ డిజైన్ చేశారు.

సినిమాకు జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. మ్యూజిక్, విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ టాప్ నాచ్‌గా ఉన్నాయని టీజర్ ద్వారా స్పష్టమవుతోంది. మార్క్ ఆంటోనీ సినిమా ఛాయలు కనిపించినప్పటికీ, ఈసారి అజిత్ పూర్తి స్థాయి మాస్ అవతారంలో ప్రేక్షకులను అలరించనున్నాడు.

ఏప్రిల్ 10న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన మరో హిందీ చిత్రం, సన్నీ డియోల్ నటించిన జాత్ కూడా అదే రోజున విడుదల కానుంది. ఈసారి అజిత్ తన మాస్ మేనరిజం, మల్టిపుల్ లుక్స్, స్టైలిష్ యాక్షన్ మోతాదుతో గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తాడా? అన్నది ఆసక్తిగా మారింది.


Recent Random Post: