ఇండియన్ 3 షూటింగ్ అప్‌డేట్ – లైకా తప్పుకుందా?

Share


విలక్షణ నటుడు కమల్ హాసన్ – శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం ఇండియన్ 1996లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఏఎం రత్నం నిర్మించిన ఈ సినిమా అప్పటి దశలో సంచలన విజయాన్ని సాధించింది. అనేక సంవత్సరాల తర్వాత శంకర్ దీని సీక్వెల్ ఇండియన్ 2 తెరకెక్కించారు.

లైకా ప్రొడక్షన్స్ మరియు రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలైనా, ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందించలేకపోయింది. సినిమాపై మిశ్రమ స్పందన రావడంతో, సోషల్ మీడియాలో తీవ్ర ట్రోలింగ్ ఎదురైంది. శంకర్ మునుపటి సినిమాల స్థాయిలో ఉండలేదని, ఆయన మార్క్ కనిపించలేదని పలువురు విమర్శించారు.

ఈ నేపథ్యంలో ఇండియన్ 3 గురించి అధికారిక అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఇండియన్ 2 క్లైమాక్స్‌లో మూడో పార్ట్‌కి సంబంధించిన ట్రైలర్‌ను రివీల్ చేశారు. ఆ తర్వాత ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదల అవుతుందనే వార్తలు గట్టిగా వినిపించాయి. కానీ ఇటీవలే శంకర్ స్పష్టత ఇస్తూ, ఇండియన్ 3ను థియేటర్లలోనే విడుదల చేస్తామని తెలిపారు.

ఇండియన్ 3 కోసం ఇంకా కొన్ని సన్నివేశాల షూటింగ్ బాకీ ఉందని, వాటిని పూర్తి చేసేందుకు ఆరు నెలల సమయం పడుతుందని శంకర్ వెల్లడించారు. షూటింగ్‌తో పాటు ఇతర కార్యక్రమాలను వేగంగా పూర్తి చేసి, ఈ సినిమాను కొద్ది నెలల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని యూనిట్ భావిస్తోంది.

అయితే, ఇండియన్ 2 వల్ల భారీ నష్టాలు ఎదుర్కొన్న లైకా ప్రొడక్షన్స్, ఇప్పుడు ఇండియన్ 3 నుంచి తప్పుకునే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ఇక ఈ ప్రాజెక్ట్‌ను పూర్తిగా రెడ్ జెయింట్ మూవీస్ టేకోవర్ చేయాలని యోచిస్తోంది. రీసెంట్‌గా శంకర్, కమల్ హాసన్ మధ్య చర్చలు జరిగాయని, తక్కువ సమయంలో షూటింగ్ పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

లైకా సినిమాను వదిలేసినప్పటికీ, ఇప్పటికే భారీ బడ్జెట్ పెట్టడంతో పాటు, 10% మాత్రమే షూటింగ్ పెండింగ్ ఉండటంతో, వారికి సినిమా క్రెడిట్ మాత్రం ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఇండియన్ 3 మిగతా పార్ట్ ఎప్పుడు పూర్తవుతుందో, సినిమాను థియేటర్లలో ఎప్పుడు విడుదల చేస్తారో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.


Recent Random Post: