ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కొత్త షెడ్యూల్ డిసెంబర్‌లో ప్రారంభం

Share


యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న డ్రాగన్ షూట్ కొనసాగుతూనే ఉన్నా, గత మూడు నెలలుగా సినిమా ఆగిపోయిందన్న ప్రచారం పెద్ద ఎత్తున వినిపించింది. తారక్ ఔట్‌పుట్‌తో సంతృప్తి చెందలేదని, అందుకే షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఇదే సమయంలో తారక్ అకస్మాత్తుగా స్లిమ్ లుక్‌లో కనిపించడం కూడా ఈ రూమర్స్‌కు మరింత బలం ఇచ్చింది. “డ్రాగన్ కోసం మధ్యలో ఎందుకు వెయిట్ లాస్?” అంటూ చర్చలు నడిస్తుండగా, ఇది కొత్త సినిమా ప్రిపరేషన్ అన్న మరో కథ కూడా వినిపించింది.

కానీ ఈ ప్రచారాలపై ఎన్టీఆర్ గానీ, ప్రశాంత్ నీల్ గానీ ఎక్కడా స్పందించలేదు. తమ పని తామే చేసుకుంటూ ముందుకు సాగుతుండటంతో, ఇవన్నీ సోషల్ మీడియాలో సాగిన రూమర్స్ మాత్రమేనని తేలిపోయింది.

తాజాగా డ్రాగన్ కొత్త షెడ్యూల్‌పై కీలక అప్‌డేట్ వచ్చింది. డిసెంబర్ మొదటి వారంలో కొత్త షెడ్యూల్‌ను మొదలుపెట్టడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. రామోజీ ఫిలింసిటీలో భారీ సెట్‌లతో మూడు వారాలపాటు విరామం లేకుండా షూటింగ్ జరగనుంది. ఇందులో ఎన్టీఆర్‌తో పాటు ఇతర ప్రధాన నటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు.

ఈ షెడ్యూల్ తర్వాత క్రిస్మస్–న్యూ ఇయర్ సందర్భంగా సెలవులు ప్రకటించబడతాయి. తిరిగి జనవరి 5 నుండి ఇదే షెడ్యూల్ కొనసాగుతుంది. ఇదే సమయంలో ఆఫ్రికా షెడ్యూల్ కూడా ప్లాన్‌లో ఉంది. లోకేషన్లు ఫైనల్ అయినప్పటికీ, ముందస్తు షెడ్యూల్స్ డిలే కావడంతో అక్కడి షూట్ తాత్కాలికంగా వాయిదా పడింది. రామోజీ ఫిలింసిటీ షెడ్యూల్‌ పూర్తయ్యాక, జనవరిలో ఆఫ్రికా షెడ్యూల్ మొదలయ్యే అవకాశం ఉంది. అక్కడ కూడా దాదాపు మూడు వారాలపాటు షూటింగ్ జరుగుతుంది.

జూన్ రిలీజ్ లక్ష్యంగా ప్రకటించిన నేపథ్యంలో, మిగిలిన షూటింగ్ మరియు పోస్ట్-ప్రొడక్షన్ పనులు వేగంగా ముగించాల్సిన అవసరం ఉంది. ప్రశాంత్ నీల్ తన స్టైల్‌కు తగ్గట్టు నెమ్మదిగా షూట్ చేస్తే, జూన్ విడుదల కష్టమే. అలా అయితే తారక్ తదుపరి ప్రాజెక్టులు కూడా మరింత ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే స్టార్ దర్శకులు అతనితో పని చేయడానికి లైన్‌లో ఉన్న సంగతి తెలిసిందే.


Recent Random Post: