యువ హీరోల్లో కిరణ్ అబ్బవరం మంచి జోష్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన ‘క’ సినిమా హిట్ కావడంతో, వరుసగా అవకాశాలు అందుకుంటున్నాడు. తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ సినిమా భారీ లాభాలను తెచ్చిపెట్టడంతో కిరణ్ అబ్బవరం మార్కెట్ రేంజ్ పెరిగింది. అందువల్ల కొత్త నిర్మాతలు అతడిని అప్రోచ్ అవుతుండగా, అతని సింప్లిసిటీ కూడా వారికి నచ్చి అవకాశాలిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
త్వరలోనే ‘దిల్ రుబా’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న కిరణ్, ఇటీవల తనపై వచ్చిన సింపథీ ప్రచారంపై మరోసారి స్పందించాడు. గతంలో ‘క’ సినిమా విడుదలకు ముందు, కొంత మంది తనను టార్గెట్ చేస్తున్నారని, సోషల్ మీడియాలో నెగెటివ్ ప్రచారం చేస్తున్నారని చెప్పి, మీడియా సమావేశంలో ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే.
ఈ విషయంపై తాజాగా మాట్లాడుతూ “సింపథీ వల్ల సినిమాలు హిట్ అవుతాయని అనడం అస్సలు సరికాదు. ‘క’ సినిమా ఒక తల్లికడుపు గౌరవించే చిత్రం. నా అమ్మ పడిన కష్టాలను గుర్తు చేసుకుంటూ ఆ వేడుకలో భావోద్వేగానికి గురయ్యాను. అయితే, కొందరు దీనిని సింపథీగా మార్చారు. నిజానికి చాలా మంది హీరోలు తమ నేపథ్యం, తల్లిదండ్రుల గురించి ఏదో సందర్భంలో చెబుతారు. అలా చెప్పడం తప్పేం కాదు. కానీ, దీన్ని కొందరు అనవసరంగా సింపథీగా చూపుతున్నారు. దీన్ని చూస్తుంటే భవిష్యత్తులో నా కుటుంబం గురించి ఏదైనా చెప్పాలంటే మాట్లాడలేనేమోనని భయమేస్తోంది.” అని అన్నాడు.
అలాగే, ప్రేక్షకులు చాలా తెలివైనవారని, కంటెంట్ బలమైన సినిమాలనే ఆదరిస్తారంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. “క సినిమాలో అంతే బలమైన కంటెంట్ ఉంది కాబట్టే అది హిట్ అయింది. నిజంగా సింపథీతో సినిమాలు హిట్ అవుతాయంటే, పదిగంటలు మైక్ పట్టుకుని ఏడుస్తాను. కానీ, అసలు అలా జరగదు.” అంటూ తను సింపథీ కోసం సినిమాలు చేయలేదని స్పష్టం చేశాడు.
Recent Random Post: