
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అత్యంత బలంగా కొనసాగుతోందన్నది మూడు పార్టీల నేతల ఏకగ్రీవ అభిప్రాయం. పార్టీల మధ్య సమన్వయాన్ని కాపాడుకుంటూ, ఎలాంటి భేదాభిప్రాయాలకు తావివ్వకుండా కట్టుబాటుగా ముందుకు సాగుతున్నారు. ఇదే సమయంలో, ఈ కూటమి దృఢత్వమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన సవాల్‌గా మారిందని కూటమి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
కూటమిలో చీలికలు తీసుకురావాలనే ఉద్దేశంతో వైసీపీ తరచూ వ్యాఖ్యలు చేస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏ చిన్న సందర్భం వచ్చినా భేదాభిప్రాయాలు రేపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లు వ్యక్తిగత లేదా పార్టీ పరమైన స్వార్ధాలను పక్కనబెట్టి కూటమి బలాన్ని కాపాడేందుకు కలిసి పనిచేస్తున్నారని స్పష్టమవుతోంది.
పవన్ కళ్యాణ్ పలుమార్లు మరో 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం బలంగా కొనసాగాలని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలకు వైసీపీ నేతలు వక్రభాష్యం చెబుతూ రాజకీయ విమర్శలకు దిగుతున్నారు. తాజాగా వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ చేసిన వ్యాఖ్యలు ఇదే కోవకు చెందాయి. ‘మరో 15 ఏళ్ల పాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటారని పవన్ అంటున్నారంటే, పవన్‌కు సీఎం అయ్యే ఆలోచనే లేదా?’ అంటూ ఆయన ప్రశ్నించారు.
అయితే కూటమిలో వాస్తవ పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నంగా ఉందని నేతలు చెబుతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ, ఉపముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్‌కు సముచిత గౌరవం ఇస్తూ, నిర్ణయాల్లో ఆయనను భాగస్వామిగా ఉంచుతున్నారని స్పష్టం చేస్తున్నారు. పవన్‌ను తక్కువ స్థాయిలో చూపించే ప్రయత్నం ఎక్కడా లేదని, లోకేష్ కూడా పవన్‌ను ‘అన్న’ అని పిలవడం కూటమి అంతర్గత సాన్నిహిత్యానికి ఉదాహరణగా పేర్కొంటున్నారు.
ఎన్నికల ముందు నుంచే కూటమిలో చిచ్చు పెట్టేందుకు వైసీపీ చేసిన ప్రయత్నాలను చంద్రబాబు, పవన్, లోకేష్ సమర్థంగా తిప్పికొడుతున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇరు పార్టీల శ్రేణులకు కూటమి బలంగా ఉండాల్సిన అవసరాన్ని ప్రతి సందర్భంలోనూ నేతలు వివరిస్తూ వస్తున్నారు.
పవన్ కళ్యాణ్ రాజకీయ స్థాయి ఏమాత్రం తగ్గకుండా చంద్రబాబు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుండగా, పవన్ కూడా చంద్రబాబు పాలనా దక్షతను క్యాబినెట్ సమావేశాల్లో ప్రశంసిస్తూ, ఆయన సూచనలను స్వీకరిస్తున్నారు. ఈ పరస్పర గౌరవం వల్ల వైసీపీకి ఎలాంటి రాజకీయ అవకాశాలు దక్కకుండా కూటమి నేతలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అయినప్పటికీ, వైసీపీ అదే విమర్శలను పదే పదే చేయడంతో, ‘పవన్ సీఎం కావాలని వైసీపీకి అంత ఆతృత ఎందుకు?’ అంటూ నెటిజన్లు ప్రశ్నలు వేస్తున్నారు.
Recent Random Post:













