చంద్రబాబు వ్యూహంలో ఎన్టీయార్ చిక్కుకున్నట్లేనా.?

జూనియర్ నందమూరి తారకరామారావు.. అదేనండీ, జూనియర్ ఎన్టీయార్.. తెలుగుదేశం పార్టీ తరఫున పరోక్షంగా వకాల్తా పుచ్చుకున్నారు. ‘ఆ కుటుంబ సభ్యుడిగా కాదు..’ అంటూనే చెప్పాలనుకున్నది చెప్పేశాడు. చంద్రబాబు కంటతడి పెట్టడంపై నందమూరి కుటుంబం కదిలి వచ్చింది. బాలకృష్ణ నుంచి జూనియర్ ఎన్టీయార్ వరకూ.. అందరూ మాట్లాడారు.

అందరిలోకీ, జూనియర్ ఎన్టీయార్ వ్యాఖ్యల్లో స్పష్టత వుంది. అదే సమయంలో, చాలా డిప్లమాటిక్‌గా యంగ్ టైగర్ ఎన్టీయార్ వ్యవహరించాల్సి వచ్చింది. చట్ట సభల్లో ఎలా వుండాలి.? అన్నదానిపై చిన్నపాటి క్లాస్ తీసుకున్నాడు జూనియర్ ఎన్టీయార్. స్వతాహాగా మంచి మాటకారి కావడంతో.. ఎక్కడా తడబడకుండా చెప్పాలనుకున్నది చెప్పేశాడు.

వాస్తవానికి, ఇప్పుడున్న రాజకీయాల్లో.. సినీ నటులు తమ అభిప్రాయాలు కుండబద్దలుగొట్టాలంటే అదో పెద్ద తలనొప్పి. రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు, వాళ్ళ అభిమానులు.. నిస్సిగ్గుగా ‘దాడి’ చేసేస్తుంటారు.. అది మాటల దాడి కావొచ్చు, భౌతిక దాడి కావొచ్చు.

అందుకే, ‘మనకెందుకులే’ అని చాలామంది వదిలేసి ఊరుకుంటున్నారు. కొందరు మాత్రం, ‘డోన్ట్ కేర్’ అంటున్నారనుకోండి.. అది వేరే సంగతి. కొడాలి నాని అలాగే వల్లభనేని వంశీ.. ఒకప్పుడు యంగ్ టైగర్ ఎన్టీయార్‌కి అత్యంత సన్నహితులు. వాళ్ళిద్దరి చుట్టూనే ఇప్పుడీ రచ్చ జరుగుతోంది కూడా.

చిత్రంగా, జూనియర్ ఎన్టీయార్ కూడా ఆ ఇద్దరి తీరుని పరోక్షంగా తప్పుపట్టాడు. ‘టీడీపీని ఎన్టీయార్‌కి అప్పగించెయ్యాలి..’ అని డిమాండ్ చేసిన, చేస్తున్న రాజకీయ నాయకుల్లో వల్లభనేని వంశీ, కొడాలి నాని కూడా వున్నారు. మరి, టీడీపీని జూనియర్ ఎన్టీయార్ దక్కించుకుంటాడా.? దక్కించుకుంటే వంశీ, నాని పరిస్థితేంటి.?

అవన్నీ తర్వాత, చంద్రబాబు వ్యూహం ఫలించింది. జూనియర్ ఎన్టీయార్ కూడా మీడియా ముందుకొచ్చాడు. అయితే, చంద్రబాబు పన్నిన వ్యూహంలో ఎన్టీయార్ చిక్కుకుపోయాడన్న ఆవేదన మాత్రం అభిమానుల్లో వ్యక్తమవుతోంది. ఇక, బులుగు కార్మికులు జూనియర్ ఎన్టీయార్ మీద ట్రోలింగ్ చేయడమంటారా.? పేటీఏం ఛార్జీలకు తగ్గట్టుగా ఆ మాత్రం పని చేయకపోతే ఎలా.?


Recent Random Post: