చియాన్ విక్రమ్ కెరీర్ జ‌ర్నీ

Share


భారతీయ సినిమాల్లో ప్రయోగాలకు, ప్రయోగాత్మక పాత్రలకు చిరునామాగా నిలిచిన లెజెండరీ నటుడు Kamal Haasan. ఆయన చేసినంత విభిన్నమైన పాత్రలు, సాహసోపేత ప్రయోగాలు ఇప్పటికీ ఎవ్వరూ టచ్ చేయలేకపోయారనే చెప్పాలి. ఆ తర్వాత ఆ స్థాయిలో కాకపోయినా, విభిన్న పాత్రలతో తనదైన ముద్ర వేసిన నటుడిగా గుర్తింపు పొందినవాడు చియాన్ Vikram.

తమిళ చిత్రం ఎన్ కాదల్ కన్మణితో హీరోగా కెరీర్ ప్రారంభించిన విక్ర‌మ్, తరువాత తెలుగు ప్రేక్షకులకు చిరునవ్వుల వరమిస్తావాతో పరిచయమయ్యాడు. ఆ తర్వాత ఆడాళ్లా మజాకా, బంగారు కుటుంబం, ఊహ, అక్కా బాగున్నావా, మెరుపు వంటి చిత్రాల్లో నటించినప్పటికీ, పెద్దగా బ్రేక్ రాలేదు. దాంతో అతను పూర్తిగా ప్రయోగాత్మక పాత్రల వైపు దృష్టి పెట్టాడు.

దర్శకుడు బాలతో కలిసి చేసిన సేతు విక్ర‌మ్ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. మానసికంగా సమస్యలు ఉన్న పాత్ర కోసం ఏకంగా 21 కిలోల బరువు తగ్గి నటించడం అప్పట్లో పెద్ద సంచలనం. 1999లో విడుదలైన ఈ సినిమా ఘన విజయాన్ని సాధించి, నటుడిగా విక్ర‌మ్‌కు కొత్త గుర్తింపును తీసుకొచ్చింది.

ఆ ప్రోత్సాహంతో విక్ర‌మ్ మరిన్ని ప్రయోగాలకు సిద్ధమయ్యాడు. 2001లో కాశి సినిమాలో అంధుడి పాత్రలో నటించి ప్రశంసలు అందుకున్నాడు. అయితే ఆ పాత్ర కారణంగా కొంతకాలం అతని కంటి చూపుపై ప్రభావం పడిందని అప్పట్లో వార్తలు వచ్చాయి.

తర్వాత బాల దర్శకత్వంలో వచ్చిన పితామగన్ విక్ర‌మ్ కెరీర్‌లో మరో మైలురాయి. శ్మశానంలో పెరిగిన వ్యక్తిగా, డైలాగ్స్ లేకుండా కేవలం హావభావాలతో నటించి జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నాడు. ఈ పాత్రకు ఆయనకు జాతీయ అవార్డు కూడా లభించింది.

కమర్షియల్ సినిమాల్లో కూడా విక్ర‌మ్ తనదైన ముద్ర వేసాడు. స్వామి, జెమిని, ధూల్, అరుళ్ వంటి యాక్షన్ చిత్రాలతో పాటు విభిన్న పాత్రల్లో కనిపించాడు. అయితే అతని నటనా ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసిన చిత్రం అపరిచితుడు. ఇందులో ఒక్క క్షణంలోనే భావాలు మారే బహుళ వ్యక్తిత్వ పాత్రలో విక్ర‌మ్ నటన ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది.

తరువాత నాన్న, ఐ, కోబ్రా, తంగలాన్ వంటి సినిమాల్లో విభిన్న గెటప్స్‌తో ప్రయత్నాలు చేసినప్పటికీ, గతంలో కనిపించినంత స్థాయి విజయాలు మాత్రం రాలేదు. దీంతో కెరీర్ కొంత తగ్గినట్లు కనిపిస్తోంది.

ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్న విక్ర‌మ్, మళ్లీ తన ప్రత్యేకమైన నటనతో పూర్వ వైభవాన్ని తిరిగి సంపాదించాలనే ఆశ అభిమానుల్లో ఉంది.


Recent Random Post: