‘జైలర్ 2’లో చిరు-బాలయ్య కలయిక నిజమేనా?

Share


మెగాస్టార్ చిరంజీవి – న‌టసింహ బాలకృష్ణ కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడు వస్తుందా? అనే ఉత్కంఠ అభిమానుల్లో ఎప్పటినుంచో నెలకొని ఉంది. చిరంజీవి స్వయంగా బాలయ్యతో కలిసి నటించాలని కోరిక వ్యక్తం చేయడంతో ఈ కాంబోపై మరింత ఆసక్తి పెరిగిపోయింది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను బోయపాటి శ్రీను తెరకెక్కిస్తాడా? అని ఎదురుచూస్తున్నప్పటికీ, తాజా సమాచారం ప్రకారం తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ కలయికను సాకారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం నెల్సన్, సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ‘జైలర్ 2’ ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో స్టార్ హీరోలు నటిస్తారని ముందుగానే అంచనా వేయబడింది. ఇప్పటికే మోహన్ లాల్, శివరాజ్ కుమార్ వంటి అగ్ర తారలు ఇందులో భాగమయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

ఇదిలా ఉండగా, టాలీవుడ్ నుంచి బాలకృష్ణ ‘జైలర్ 2’ లో కీలక పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఆయన ఎంట్రీ దాదాపు ఖాయమైందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే తరుణంలో చిరంజీవి పేరు కూడా తెరపైకి వచ్చింది. ఇటీవల రజనీకాంత్ స్వయంగా చిరంజీవికి ఫోన్ చేసి, ఈ చిత్రంలో నటించాల్సిందిగా కోరారట. దర్శకుడు నెల్సన్ ప్రత్యేకంగా ఓ పవర్‌ఫుల్ రోల్ రూపొందించడంతో చిరు కూడా ఈ ఆఫర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అదే నిజమైతే ‘జైలర్ 2’ పాన్-ఇండియా స్థాయిలో భారీ హైప్ సొంతం చేసుకోనుంది. మెగా-నందమూరి అభిమానుల కల నిజమవడమే కాకుండా, ఈ ప్రాజెక్ట్ కోలీవుడ్‌కు కూడా 1000 కోట్ల క్లబ్‌ను అందించే అవకాశముందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బాలయ్య-చిరు పాత్రలు స్టైలిష్‌గా, పవర్‌ఫుల్‌గా ఉండేలా రూపొందే అవకాశముంది. మరి ఈ క్రేజీ కాంబినేషన్ నిజమవుతుందా? అనే దానిపై అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలి!


Recent Random Post: