టాలీవుడ్‌లో కార్మికుల సమ్మెపై విశ్వప్రసాద్ స్పందన

Share


సినీ పరిశ్రమలో ప్రస్తుతం కార్మికుల సమ్మెతో షూటింగ్‌లకు అంతరాయం కలిగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా చిన్న, మధ్యతరహా చిత్రాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. 30 శాతం వేతన పెంపు డిమాండ్ చేస్తూ సినీ కార్మికులు సమ్మె బాట పట్టారు. అయితే, నిర్మాతలు దీనికి ఒప్పుకునేందుకు సుముఖంగా లేరు. ఇప్పటికే ఇతర పరిశ్రమల కంటే తగినంత డీసెంట్ వేతనాలు అందిస్తున్నామనే వాదనను గిల్డ్ సభ్యులు ఉద్ఘాటిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్ తాజాగా మీడియా సమావేశంలో స్పందించారు. తెలుగు సినిమా మేకింగ్‌ ఖర్చులు ఇతర ఇండస్ట్రీలతో పోల్చితే నాలుగైదు రెట్లు ఎక్కువగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

“మలయాళంలో కోటి రూపాయలతో సినిమా తీయగలుగుతున్నారు. అదే సినిమా తెలుగులో చేస్తే నాలుగు కోట్లకు చేరుతోంది. మేకింగ్‌పై అవగాహన ఉన్నవారికి ఇది 4-5 కోట్లు అవుతుంది. తెలియకపోతే 10-15 కోట్లు కూడా అవుతుంది,” అని వివరించారు.

అలాగే, సెట్‌పై పని చేస్తున్న 300 మందిలో 50 శాతం మందికి సాఫ్ట్‌వేర్ స్థాయిలో వేతనాలు చెల్లిస్తున్నామని చెప్పారు. మిగిలిన వారికి కూడా డీసెంట్‌ పే అందుతున్నట్టు పేర్కొన్నారు. తెలంగాణ గ్రామాల్లో దినసరి కూలీతో పోలిస్తే టాలీవుడ్ కార్మికులకు మెరుగైన వేతనాలు ఇస్తున్నారని స్పష్టం చేశారు.

ఇక స్థానిక ప్రతిభావంతులకు అవకాశాలు రావాలంటే అసోసియేషన్ సభ్యత్వం ఒక అడ్డుగోడగా మారుతోందని విశ్వప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. మెంబర్‌షిప్ పొందడానికి పెద్దగా చెల్లింపులు చేయాల్సి వస్తోందని, ఇది యువ ప్రతిభను పరిశ్రమ నుంచి దూరం చేస్తున్నదని అభిప్రాయపడ్డారు.

“నేను ఫెడరేషన్‌కు వ్యతిరేకిని కాదు. ఈ అంశాలపై చాలా కాలంగా ఇంటర్నల్గా మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీడియా ఎదుట మాట్లాడినందునే నా వ్యాఖ్యలు హైలైట్ అయ్యాయి. ఇది వ్యక్తిగత విమర్శ కాదు. సమస్యలపై చర్చ అవసరం,” అని స్పష్టం చేశారు.

చివరగా, పరిశ్రమలో సమస్యల పరిష్కారం కోసం అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలంటూ, “గిల్డ్ ఒక్కదే పరిష్కారం కాదు. నిర్మాతలు, కార్మికులు కలిసి చర్చలు జరిపితేనే మంచి మార్గం దొరుకుతుంది,” అంటూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.


Recent Random Post: