
రోజా, బొంబాయి, కాదల్, ఓకే కన్మణి వంటి అనేక క్లాసిక్ చిత్రాలతో ఏ.ఆర్. రెహమాన్ – మణిరత్నం కాంబినేషన్ ప్రేక్షకుల మదిలో చెరిగిపోని ముద్ర వేసింది. కొంతకాల విరామం తర్వాత ఇప్పుడు థగ్ లైఫ్ అనే గ్యాంగ్‌స్టర్ డ్రామా కోసం ఈ గొప్ప కలయిక మరోసారి పునరావృతమైంది. కమల్ హాసన్, శింబు, త్రిష లాంటి అగ్ర తారలతో రూపొందిన ఈ సినిమా త్వరలో విడుదల కాబోతున్న సందర్భంగా ప్రోమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.
ఈ సందర్భంగా రెహమాన్ తన కెరీర్లో మణిరత్నం తో ఉన్న ప్రత్యేక బంధాన్ని గురించి పంచుకున్నారు. “థగ్ లైఫ్ కోసం అన్ని సంగీత కంపోజిషన్లు పూర్తయిన తర్వాత చివరి నిమిషంలో మణిరత్నం గారు ఒక సన్నివేశంలో మరింత ఉత్కంఠను ఎలా తేవచ్చో అడిగారు. అప్పటికే సౌండ్ ఇంజినీర్ బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన వెళ్లే గంట ముందు నేను స్టూడియోకి వెళ్లి ఆ ట్రాక్‌ను పూర్తి చేశాను. మా ఇద్దరి మధ్య అంతటి అర్ధం చేసుకునే సంబంధం ఉంది,” అని తెలిపారు రెహమాన్.
అలాగే, “ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందించడమే మా లక్ష్యం. నేను జింగిల్ ఇండస్ట్రీలో పనిచేస్తూ ఎదిగాను. మణిరత్నం గారు నా మార్గాన్ని ఎప్పటి నుంచో గమనిస్తున్నారు. నేను చెన్నైలో ఉన్నప్పుడు ఆయన కూడా అక్కడే ఉండేవారు. నేను ‘బాంబే డ్రీమ్స్’లో పనిచేస్తున్నప్పుడు ఆయన్ను లండన్‌కి వచ్చినప్పుడు కలిశాను. ఆయన బాలీవుడ్‌కి రాలేకపోయినా, నా వర్చువల్ రియాలిటీ పనిపై తన అభిప్రాయాలు చెప్పేవారు” అంటూ తమ మధ్య స్నేహపూరిత అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
ఇటీవల చెన్నైలో జరిగిన థగ్ లైఫ్ ఆడియో లాంచ్ ఈవెంట్ మంచి హైప్ క్రియేట్ చేసింది. ఆడియో ఆల్బమ్‌లో జింగుచా, షుగర్ బేబీ, ముత్త మలై, విన్వేలి నాయగ వంటి పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్ చూసినవారంతా ఈ సినిమాకు నేపథ్య సంగీతం ఒక స్పెషల్ హైలైట్ అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలుగు పాటలు ఎంతవరకు ఆకట్టుకుంటాయో జూన్ 5న విడుదలయ్యే థియేటర్ ప్రదర్శనలపై ఆధారపడి ఉంటుంది.
Recent Random Post:















