
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునను పెద్ద తెరపై హీరోగా చూడాలని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. “కుబేర”, “కూలీ” వంటి చిత్రాల్లో నటించినప్పటికీ, నాగ్‌ను ప్రధాన పాత్రలో చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన తన 100వ సినిమాపై పూర్తి దృష్టి సారించారు. అధికారిక ప్రకటన ఇంకా వెలువడకపోయినా, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ షూటింగ్ కొనసాగుతోందని సమాచారం. రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను నాగార్జున స్వయంగా తన సొంత బ్యానర్‌లో నిర్మిస్తున్నారని టాక్. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.
ఈ ప్రత్యేక సినిమాలో నాగ చైతన్య, అఖిల్ అక్కినేని, అమల అక్కినేని కూడా కీలక పాత్రల్లో కనిపించే అవకాశం ఉందని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద నాగ్ 100వ సినిమా చుట్టూ భారీ ఆసక్తి నెలకొంది.
అంతేకాక, తన వందో సినిమాకి ముందు నాగార్జున అభిమానులను నాస్టాల్జియాలో ముంచెత్తే రెండు కల్ట్ క్లాసిక్ చిత్రాలను మళ్లీ థియేటర్లలోకి తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు — శివ మరియు గీతాంజలి.
శివ సినిమా నవంబర్ 14, 2025న సరికొత్త పిక్చర్ క్వాలిటీ, మెరుగైన సౌండ్ సిస్టమ్‌తో రీ-రిలీజ్ అవుతోంది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ డ్రామా అప్పట్లో తెలుగు సినిమా చరిత్రలో సెన్సేషన్ సృష్టించింది. టెలివిజన్‌లో ఎన్నిసార్లు ప్రసారం అయినప్పటికీ, థియేటర్‌లో కొత్త అనుభూతి కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఇదే సమయంలో, మణిరత్నం దర్శకత్వం వహించిన క్లాసిక్ రొమాంటిక్ డ్రామా గీతాంజలి కూడా రీ-రిలీజ్ కోసం సిద్ధమవుతోంది. 1989లో విడుదలైన ఈ చిత్రం నాగార్జున కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. కేవలం కోటిన్నర బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఇళయరాజా సంగీతంతో అద్భుత విజయాన్ని సాధించింది. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో డబ్ అయి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇప్పుడు ఈ సినిమాను 4K టెక్నాలజీ, డాల్బీ సౌండ్‌తో రీ-రిలీజ్ చేయాలనే ప్రణాళిక ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది.
నాగార్జున 100వ సినిమా 2026 మేలో విడుదలయ్యే అవకాశముందని సమాచారం. అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. శివ, గీతాంజలి రీ-రిలీజ్‌లతో నాగ్ ఫ్యాన్స్‌కు ఇది నిజంగా ఒక సినీ పండుగగా మారనుంది.
Recent Random Post:















