పూజా హెగ్దే మళ్లీ ఫామ్‌లోకి వస్తుందా?

Share


బుట్ట బొమ్మ పూజా హెగ్దే ఒకప్పుడు టాలీవుడ్‌లో వరుస స్టార్ సినిమాలతో అదరగొట్టేసింది. స్టార్ హీరో సినిమా అంటే చాలు — హీరోయిన్ పూజా హెగ్దేనే అనుకునేంత రేంజ్‌లో క్రేజ్ తెచ్చుకుంది. కానీ హిట్స్ వరుసగా పడినంతగా, ఫ్లాప్స్ కూడా తగిలాయి. ఫలితంగా ఆమె కెరీర్ కాస్త నిలిచిపోయింది. రాధే శ్యామ్ తర్వాత పూజా హెగ్దేకి ఒక్క తెలుగు సినిమా కూడా రాలేదు. మహేష్ బాబు నటించిన గుంటూరు కారం నుంచి ఆమె మధ్యలోనే బయటకు రావడం, ఆ తర్వాత కొన్ని ప్రాజెక్టులు కూడా చేజారడానికి కారణమైందని టాక్.

బాలీవుడ్‌లో కూడా ఆమె కెరీర్ ఆశించినంతగా రాణించలేదు. అందుకే ఇప్పుడు పూజా హెగ్దే తన దృష్టిని తమిళ సినీ పరిశ్రమపై కేంద్రీకరించింది. అసలు తన తెరంగేట్రం కూడా తమిళ్ ఫిల్మ్ ద్వారానే చేసిన పూజా, ఇప్పుడు మళ్లీ అదే ఇండస్ట్రీలో బిజీగా మారింది. సూర్యతో చేసిన రెట్రో పెద్దగా వర్క్ అవుట్ కాకపోయినా, వరుసగా కొత్త అవకాశాలు వస్తున్నాయి.

ప్రస్తుతం ఆమె దళపతి విజయ్‌తో జన నాయకన్లో నటిస్తోంది. అదనంగా రాఘవ లారెన్స్‌తో కాంచనా 4లో హీరోయిన్‌గా ఎంపికయ్యింది. మరో రెండు తమిళ ప్రాజెక్టులు కూడా చర్చల్లో ఉన్నాయని సమాచారం. మరోవైపు, చాలా కాలం తర్వాత దుల్కర్ సల్మాన్‌తో రవి కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ తెలుగు సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాను దసరా మేకర్ సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. తెలుగులో పూజా తిరిగి నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం.

సినిమాలు చేయకపోయినా, పూజా హెగ్దేకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు. సోషల్ మీడియాలో ఆమె పోస్టులు, ఫొటోలు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. పూజా కూడా మళ్లీ తెలుగులో పెద్ద సినిమాలు చేయాలన్న ఆసక్తి వ్యక్తం చేస్తోంది. దుల్కర్ సల్మాన్ సినిమాలు అన్నీ సక్సెస్ అవుతున్న నేపథ్యంలో, ఈ సినిమా ఆమెకు తిరిగి ఫామ్ అందించే అవకాశం ఉందని సినీ వర్గాలు అంటున్నాయి.


Recent Random Post: