ఫిష్ వెంకట్ కన్నుమూత: సినీ లోకానికి తీరనిలోటు

Share


తెలుగు సినీ పరిశ్రమలో తనదైన హాస్యశైలి, మాస్ డైలాగ్స్‌తో ప్రత్యేక గుర్తింపు పొందిన నటుడు ఫిష్ వెంకట్ (అసలు పేరు ముంగిలంపల్లి వెంకటేష్) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 53 సంవత్సరాలు. గత కొన్ని సంవత్సరాలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందించగా, కొద్ది రోజుల వ్యవధిలోనే ఆయన మృతి చెందటం విచారకరం.

చదువులో పెద్దగా ముందుకుపోని వెంకట్, జీవనోపాధి కోసం ముషీరాబాద్‌లో కూరగాయల మార్కెట్‌లో చేపలు అమ్ముతూ జీవనం సాగించారు. ఆ వృత్తి ఆధారంగా ‘ఫిష్ వెంకట్’ అనే పేరుతో సినీ ప్రపంచంలోకి ప్రవేశించారు. ప్రముఖ నటుడు శ్రీహరి ద్వారా దర్శకుడు వివి వినాయక్‌కు పరిచయమై, “ఆది” సినిమా ద్వారా జూనియర్ ఎన్టీఆర్‌కు అనుబంధ పాత్రలో నటించడంతో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు.

“తొడ కొట్టు చిన్నా” అనే డైలాగ్‌తో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన వెంకట్, ఆ తరువాత “బన్నీ”, “శౌర్యం”, “గబ్బర్ సింగ్”, “నాయక్”, “సుబ్రహ్మణ్యం ఫర్ సేల్”, “సుప్రీమ్”, “డీజే టిల్లు” వంటి పలు ప్రముఖ చిత్రాల్లో వినోదాత్మక పాత్రలతో మెప్పించారు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రవితేజ, రామ్ చరణ్ తదితర స్టార్ హీరోలతో పనిచేయడం పట్ల ఆయన గర్వంగా భావించేవారు.

అవార్డులు లేనప్పటికీ, ప్రేక్షకుల మన్ననలు పొందిన ఫిష్ వెంకట్ చివరిసారిగా 2024 జనవరిలో ఆహా ఓటిటీలో విడుదలైన “కాఫీ విత్ కిల్లర్” చిత్రంలో కనిపించారు. చిన్న పాత్రల్లోనూ పెద్ద గుర్తింపు తెచ్చుకున్న ఈ హాస్య నటుడు తనదైన శైలితో తెలుగు సినీ ప్రేమికుల మనసుల్లో నిలిచిపోయారు.

ఆయన అకాలమరణం సినీ పరిశ్రమకు తీరనిలోటు.


Recent Random Post: