‘బైకర్’పై శర్వానంద్ గట్టి ధీమా!

Share


ఈ మధ్య కాలంలో సినిమా విజయంలో హీరోలు ఎంత కాన్ఫిడెంట్‌గా ఉంటున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొందరు హీరోలు రిలీజ్‌కు ముందే సవాళ్లు విసురుతుంటే, మరికొందరు రిలీజ్ తర్వాత చొక్కా కాలర్ ఎగరేసే స్థాయిలో ధీమా చూపిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ‘మహర్షి’ విజయం తర్వాత “కాలర్ ఎగరేసి కొట్టాం” అంటూ అభిమానుల్లో ఉత్సాహం నింపారు. ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ‘దేవర’ విషయంలో అంతే కాన్ఫిడెంట్‌గా మాట్లాడారు. “ప్రతి అభిమాని కాలర్ ఎగరేసి చెప్పుకునేలా దేవర ఫలితం ఉంటుంది” అంటూ తన నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

అలాగే హీరో నాని నిర్మించిన ‘కోర్టు’ సినిమా రిలీజ్ సమయంలో, అది సక్సెస్ కాకపోతే తాను నటించిన ‘హిట్: ది థర్డ్ కేస్’ చూడొద్దంటూ పబ్లిక్‌గా సవాల్ విసిరి, ఆ సవాల్‌ను సక్సెస్‌తో నిలబెట్టుకున్నాడు. అంతకుముందు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా ‘క’ సక్సెస్ కాకపోతే సినిమాలు వదిలేసి ఊరెళ్లిపోతానంటూ ఛాలెంజ్ విసిరి, అదే సినిమాతో విజయం అందుకున్నాడు.

ఇటీవలే యంగ్ హీరో శర్వానంద్ కూడా ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

ఈ సినిమా రిలీజ్‌కు ముందు శర్వానంద్ ఎలాంటి సవాళ్లు చేయకపోయినా, తన తదుపరి సినిమా విషయంలో మాత్రం తొలిసారిగా గట్టి ధీమా వ్యక్తం చేశాడు. శర్వానంద్ హీరోగా అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బైకర్’ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ, ‘బైకర్’ భారతదేశమే గర్వపడేలా ఉంటుంది. ఇది తెలుగు సినిమా అని కాలర్ ఎగరేసి చెప్పుకునేంత గొప్పగా ఉంటుంది అంటూ తన నమ్మకాన్ని వెల్లడించాడు.

ఇంతవరకు తాను నటించిన ఏ సినిమా గురించి కూడా శర్వానంద్ ఇలాంటి భారీ ఎలివేషన్ ఇవ్వలేదు. సాధారణంగా సినిమా గురించి నాలుగు పాజిటివ్ మాటలు మాట్లాడటానికే పరిమితమయ్యేవాడు. మొన్న విడుదలైన ‘నారీ నారీ నడుమ మురారి’ గురించి కూడా పెద్దగా హైప్ క్రియేట్ చేయలేదు. అలాంటిది ‘బైకర్’ గురించి ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడంటే, ఈ ప్రాజెక్ట్‌పై శర్వానంద్‌కు ఉన్న కాన్ఫిడెన్స్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.

అయితే ఇక్కడ అవసరమైంది మాటల్లో నమ్మకం చూపించడమే కాదు… ఆ నమ్మకాన్ని ఫలితాల్లో నిలబెట్టేలా హిట్ కొట్టి చూపించడమే. విజయం అనేది మాటల కోటలు దాటినంత సులభం కాదు. ఎందుకంటే విజయం అనే మాటతో పాటు విమర్శలు, ట్రోలింగ్‌లు కూడా వస్తాయని గుర్తుంచుకోవాల్సిందే.


Recent Random Post: