
సినిమా విజయం అనేది కేవలం ఒక్క వ్యక్తి ప్రతిభపై ఆధారపడదనే విషయం అందరికీ తెలిసిందే. కథ, కథనం, నటీనటుల పర్ఫార్మెన్స్, సంగీతం, విజువల్స్, దర్శకత్వం వంటి అనేక అంశాలు కలిసి ఒక సినిమాను విజయవంతం చేస్తాయి. అయితే సినిమా హిట్ అయితే ఆ క్రెడిట్ ఎక్కువగా హీరో లేదా దర్శకుడికి దక్కడం, అదే సినిమా ఫ్లాప్ అయితే మాత్రం హీరోయిన్‌పై విమర్శలు రావడం ఇండస్ట్రీలో చాలా కాలంగా కొనసాగుతున్న చర్చ.
ముఖ్యంగా హీరోయిన్ నటించిన సినిమాలు వరుసగా పరాజయం పాలైతే, ఆమెపై “ఐరన్ లెగ్” అనే ముద్ర వేయడం సాధారణంగా మారిపోయింది. గతంలో రమ్యకృష్ణ, రోజా వంటి సీనియర్ హీరోయిన్ల నుంచి మొదలుకొని శృతిహాసన్, పూజా హెగ్డే, శ్రీలీల, కృతి శెట్టి వంటి పలువురు నటీమణులు కూడా ఇలాంటి విమర్శలను ఎదుర్కొన్నారు. అయితే హీరోలు వరుసగా పరాజయాలు అందుకున్నప్పటికీ వారికి ఇలాంటి ట్యాగ్స్ ఎందుకు రావు అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఇదే విషయంపై హీరోయిన్ భాగ్యశ్రీ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇటీవల ‘లెనిన్’ సినిమాతో విజయాన్ని అందుకున్న ఆమె, గతంలో వరుస ఫ్లాపుల కారణంగా తనపై కూడా “ఐరన్ లెగ్” అనే ట్యాగ్ వేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన భాగ్యశ్రీ, “నాపై ఐరన్ లెగ్ అనే ట్యాగ్ పెట్టినందుకు నేను ఎప్పుడూ బాధపడలేదు. కానీ దాని వెనుక ఉన్న అసలు అర్థం తెలియకపోవడం బాధ కలిగించింది” అని తెలిపారు.
సినిమా నిర్మాణంలో స్క్రిప్ట్ మార్పులు, ఎడిటింగ్ నిర్ణయాలు, దర్శకత్వం వంటి కీలక అంశాలపై నటీనటులకు పూర్తి నియంత్రణ ఉండదని పేర్కొంటూ, ఒక సినిమా విఫలమైతే హీరోయిన్‌ను మాత్రమే ఎందుకు బాధ్యురాలిగా చేస్తారని ఆమె ప్రశ్నించారు.
అలాగే శృతిహాసన్, తాప్సీ పన్ను, శ్రీలీల వంటి పలువురు హీరోయిన్లు కూడా కెరీర్‌లో ఇలాంటి విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ, వాటిని అధిగమించి ఇప్పుడు మంచి స్థాయికి చేరుకున్నారని ఆమె ఉదాహరణగా చెప్పారు.
“సినిమా అనేది ఒక టీమ్ ఎఫర్ట్. ఒక సినిమా విజయం లేదా పరాజయాన్ని కేవలం ఒక్క వ్యక్తికి మాత్రమే ఆపాదించడం సరైనది కాదు. సినిమా హిట్ అయితే మొత్తం క్రెడిట్‌ను హీరోయిన్‌కు ఇస్తారా?” అంటూ భాగ్యశ్రీ ప్రశ్నించారు.
సినిమా ఫ్లాప్‌లకు కేవలం హీరోయిన్లనే బాధ్యులను చేయడం సరైన విధానం కాదని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం భాగ్యశ్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె చెప్పిన విషయాల్లో నిజం ఉందని, సినిమా ఫలితాలపై దృష్టికోణం మారాల్సిన అవసరం ఉందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
Recent Random Post:















