మెగాస్టార్ మూవీకి రమణ గోగుల మ్యాజిక్!

Share


ఇండస్ట్రీకి దూరమైపోయాడని భావించిన రమణ గోగులను సంక్రాంతి సందర్భంగా తిరిగి తెరపైకి తీసుకొచ్చిన అనిల్ రావిపూడి, భీమ్స్ సిసిరోలియోలు ఊహించిన దానికన్నా అద్భుతమైన ఫలితం అందుకున్నారు. “గోదారి గట్టు మీద రామసిలకవే” అంటూ ఆయన పాడిన పాట నెట్టింట హోరెత్తిపోవడమే కాదు, సినిమా ఓపెనింగ్స్‌లోనూ కీలక భూమిక పోషించిందన్నది అక్షరసత్యం. ఈ పాటతో రమణ గోగులకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. ప్రస్తుతం, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్లు ఆయనతో పాటలు పాడించుకోవాలని ఆసక్తిగా ఉన్నా, రమణ గోగుల మాత్రం ఎంతో ఆచితూచి ఎంపికలు చేసుకుంటున్నారని తెలుస్తోంది.

తాజా అప్‌డేట్ ప్రకారం, మెగాస్టార్ చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రంలోనూ రమణ గోగుల మరోసారి తన స్వరాన్ని అందించబోతున్నారు. భీమ్స్ కంపోజ్ చేసిన ఓ హై ఎనర్జీ మాస్ సాంగ్‌లో ఆయన గాత్రం కొత్త ఊపునిచ్చేలా ఉంటుందట. ఇంకా రికార్డింగ్ జరగనప్పటికీ, ఇటీవల ట్యూన్ విన్న చిరంజీవి ఎంతో ఇంప్రెస్ అయ్యారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఫోక్ స్టైల్‌కు మాస్ టచ్ కలిపి రూపొందించిన ఈ పాట ప్రేక్షకులను ఊర్రూతలూగించేలా ఉంటుందని చెబుతున్నారు.

ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, గతంలో పవన్ కళ్యాణ్‌కు “తమ్ముడు,” “బద్రి” వంటి సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చిన రమణ గోగుల, ఇప్పుడు అన్నయ్య చిరంజీవి కోసం పాడుతుండటం. దీంతో ఈ చిత్రానికి రియల్ వింటేజ్ ఫీలింగ్ వచ్చే అవకాశముంది.

ఈ సినిమాలో మొత్తం నాలుగు పాటలు ఉంటాయట. చిరంజీవి కామెడీ టైమింగ్‌ను మాస్ ఎలిమెంట్స్‌తో మిళితం చేస్తూ, అనిల్ రావిపూడి రూపొందించిన కథ ఇప్పటికే సగం పూర్తయిందట. మిగతా స్క్రిప్ట్‌ను నెలరోజుల్లో ఫినిష్ చేసి, వేసవి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలనే ప్లాన్‌లో ఉన్నారు. ఫస్ట్ కాపీ త్వరగా సిద్ధం చేసేందుకు టీమ్ స్పీడ్ పెంచినట్లు సమాచారం. హీరోయిన్ ఎంపిక విషయమై ఇంకా స్పష్టత రాలేదు. అదితిరావు హైదరి సహా పలు పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ, ఫైనల్ నిర్ణయం ఇంకా తీసుకోలేదట. సినిమా అధికారిక అనౌన్స్‌మెంట్ త్వరలోనే వీడియో రూపంలో రాబోతోందని ఇండస్ట్రీ టాక్.


Recent Random Post: