వెంకటేశ్ నాయుడు వైరల్ వ్యవహారం

Share


వెంకటేశ్ నాయుడు అనే వ్యక్తి పేరు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లోను, సోషల్ మీడియాలోను పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. వైసీపీ కీలక నేత మరియు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డితో బాల్య స్నేహం ద్వారా పరిచయం ఏర్పడిన ఈ నాయుడు, ఏపీ లిక్కర్ స్కాంలో కీలక భూమిక పోషించిన వ్యక్తిగా వార్తల్లో నిలిచారు.

ఇటీవలి వరకు ఆయన పేరు వినని ప్రజలు, ఇప్పుడు మాత్రం ఆయన వీడియోలు, ఫొటోలు, రాజకీయ నాయకులతో సంబంధాలు, సినీ తారలతో సమయాలు గడిపిన విశేషాలపై నోరెళ్లబెట్టే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా, టాలీవుడ్ నటి తమన్నాతో ప్రత్యేక విమానంలో ప్రయాణిస్తున్న వీడియో విపరీతంగా వైరల్ కావడం, ఆయన పరిధిని ప్రతిబింబిస్తోంది.

వైసీపీ అధికారంలో ఉన్న కాలంలో పార్టీతో సన్నిహితంగా మెలిగిన నాయుడు, ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీలైన టీడీపీ, బీజేపీ నేతలతో కూడా సన్నిహితంగా ఉండటం రాజకీయ చర్చలకు దారి తీస్తోంది. ఈ అంశంపై రాజకీయ పక్షాలు, ప్రజలు, మీడియా వర్గాలు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

దేశవ్యాప్తంగా కలకలం రేపిన సుఖేశ్ చంద్రశేఖర్, నీరా రాడియా తరహాలోనే వాస్తవాలను కప్పిపుచ్చే, లాబీయింగ్ చేసేందుకు మధ్యవర్తిగా పని చేస్తున్న కొత్త ముఖంగా వెంకటేశ్ నాయుడు పరిచయమవుతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

ఇప్పటికే బయటకు వచ్చిన వీడియోలు, ఫొటోలు గానీ, ఫోన్ డేటా డీకోడ్ అయిన తర్వాత మరిన్ని సంచలనాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. ఇది నాయుడి వ్యక్తిగత వ్యవహారంగా మిగిలిపోతుందా, లేక ఏపీ రాజకీయ వ్యవస్థలో భారీ దెబ్బకు నాంది అవుతుందా అన్నది గమనించాల్సిన విషయం.


Recent Random Post: